
లెక్కల్లోనే మొక్కలు!
పది విడతల్లో 5.26 కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలు
సాక్షి,యాదాద్రి : లెక్కల కోసమే మొక్కలు నాటినట్టుగా ఉంది అధికారుల తీరు. నాటడం, పెంపకం లెక్కలు ఘనంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 2016 నుంచి 2024 వరకు పది విడతల్లో 5కోట్ల 26లక్షల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నాటిన మొక్కలన్నింటికీ జియోట్యాగింగ్ చేసినట్లు నివేదికలున్నా 98 శాతం కనిపించడం లేదు.
నాటుడు.. నరుకుడు
మానవ శ్రేయస్సే లక్ష్యంగా పచ్చదనం పెంపునకు గత ప్రభుత్వం హయాంలో సామాజిక అడువులు పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణకు హరితహారం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే కార్యక్రమాన్ని ప్రస్తుత సర్కార్ వనమహోత్సవం పేరుతో కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమం కింద పల్లెలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఆవరణలు, ఇళ్లలో, రోడ్ల వెంబడి కోట్లాది మొక్కలు నాటారు. కానీ, కొన్ని శాఖలు ప్రణాళిక లేకుండా మొక్కలు నాటుతుండటంతో లక్ష్యం నెరవేరడం లేదు. ముఖ్యంగా విద్యుత్ లైన్ల కింద నాటిన మొక్కలు ఏపుగా పెరగగానే తీగలకు అడ్డొస్తున్నాయని ఆ శాఖ అధికారులు వాటిని తొలగిస్తున్నారు. అలాగే రహదారుల విస్తరణలో భాగంగా చెట్లను తొలగించాల్సి వస్తుంది. మరోవైపు అటవీప్రాంతాల్లో నాటిన మొక్కలు ఎదగగానే కొందరు వ్యక్తులు కలప కోసం నరికి బొగ్గుబట్టీలు, తమ అవసరాలకు తరలిస్తున్నారు.
పెరగని అటవీ విస్తీర్ణం
జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3,25,500 హెక్టార్లు. ఇందులో 3.80 శాతం అంటే 11,733.706 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిని 33.33 శాతం పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అటవీ బ్లాక్‌లలో 884 హెక్టార్లలో 42.821 లక్షల మొక్కలు నాటగా.. అందులో 20 లక్షల మొక్కలను సంరక్షించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పది శాతం కూడా కనిపించడం లేదు. మొక్కలను పెంచడంతో పాటు హెచ్‌ఎండీ పరిధిలోని 10 ఫారెస్ట్ బ్లాక్‌లలో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో కూడా చాలా మొక్కలు లేవు.
రూ.కోట్ల నిధులు వృథా
మొక్కల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ గార్డులు, మొక్కకు ఊతమిచ్చే కర్రలు, గుంతలు తీయడం, నీరు పోయడం వంటి పనునులకు గ్రీన్ బడ్జెట్, గ్రీన్‌ఫండ్ పేరుతో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు 10 శాతం నిధులను ఖర్చు చేశాయి. కానీ, ఖర్చు లెక్కల్లో చూపుతున్నా మొక్కలు మాత్రం కనిపించడం లేదు. ఆయా శాఖలు పేరుకే మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. వాటి సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదని, ఫలితంగా రూ.కోట్లు వృథా అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఇళ్లలో పెంచే మొక్కలు ఇవీ..
హోంప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా కానుగ, సీతాఫలం, అల్లనేరేడు, బహునియా, వేప, గుల్‌మొహర్, వెలగ, టెకోమా, రావి, నెమలినారా, చింత, చైనాబార్, స్పతోడియా, జామ మొక్కలు పంపిణీ చేస్తారు. వీటిని పట్టణాలకు తరలించారు.
11వ విడత లక్ష్యం.. 31.54 లక్షల మొక్కలు
11వ విడత వనమహోత్సవానికి అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 31.54లక్షలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ఇందుకోసం అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీల పర్యవేక్షణలో జిల్లాలో 428 నర్సరీలు ఏర్పాటు చేశాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు నర్సరీల్లో 1.75 లక్షలు, డీఆర్‌డీఓ 418 నర్సరీల్లో 28.46 లక్షలు, మున్సిపాలిటీలు ఏడు నర్సరీల ద్వారా 1.33 లక్షల మొక్కలు పెంచుతున్నాయి. వీటిలో పండ్లు, పూలు, నీడనిచ్చే వృక్షజాతి.. ఇలా 40 రకాల మొక్కల్లో నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.
ఫ క్షేత్రస్థాయిలో 20 శాతం కూడా కనిపించని దుస్థితి
ఫ లోపించిన ప్రణాళిక
ఫ నాటుతున్న చోటే నాటుతున్న వైనం
ఫ కొందరి జేబులు నింపడానికే కార్యక్రమం అని ఆరోపణలు
పోచంపల్లి – ముక్తాపూర్ మధ్య విద్యుత్ తీగలకు తాకుతున్నాయని చెట్లను నరికివేసిన దృశ్యం
పది విడతల్లో నాటిన మొక్కలు (లక్షల్లో)
2019 70
2020 49
2021 27
2022 30
2023 22
2024 18
సంవత్సరం మొక్కలు
2015 33
2016 73
2017 114
2018 85

లెక్కల్లోనే మొక్కలు!

లెక్కల్లోనే మొక్కలు!

లెక్కల్లోనే మొక్కలు!