
మీ సేవ కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరిటౌన్ : సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు నూతనంగా మీసేవ కేంద్రాలు మంజూరయ్యాయని, వీటి ఏర్పాటుకు అర్హులనుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చౌటుప్పల్ మండలంలో జైకేసారం, కొయ్యలగూడెం, చిన్నకొండూరు, తంగడపల్లి సంస్థాన్‌నారాయణపురం మండంలో మల్లారెడ్డిగూడెం, గుజ్జ గ్రామాలకు మీసేవ కేంద్రాలు మంజూరైనట్లు వెల్లడించారు. డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం, 21నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులన్నారు. రాత, మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. yadadri.telangana. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. దరఖాస్తులను ఈనెల 19వ తేదీ లోగా కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డ్ లేదా అవుట్‌వార్డ్ సెక్షన్‌లో అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం ఫోన్ నంబర్ 9121147135 ను సంప్రదించవచ్చన్నారు.
పరిశుభ్రతతోనే డయేరియా నియంత్రణ
సాక్షి,యాదాద్రి : పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల డయేరియాను నియంత్రించవచ్చని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో మున్సిపల్ కమిషనర్లు, శిశు సంక్షేమ, పంచాయతీ, విద్య, వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటూ డయేరియా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతిగృహాల విద్యార్థులు, వంట సిబ్బంది విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో డయేరియా నియంత్రణ చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
డీఏఓ బదిలీ
భువనగిరిటౌన్ : జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) గోపాల్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి వెంకటరమణారెడ్డి రానున్నారు.
జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం
భూదాన్‌పోచంపల్లి : స్కీమాటిక్ ఇంటర్‌వెన్షన్స్, ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్‌మెంట్ జాతీయ అవార్డుకు ఎంపికై న హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ హెడ్ ఆఫీస్ ఫర్ డెవలప్‌మెంట్ కమిషనర్ అరుణ్‌కుమార్‌ను శుక్రవారం పోచంపల్లి టై అండ్ డై ట్రస్ట్ చైర్మన్ తడక రమేశ్ సన్మానించారు. చేనేత రంగం అభివృద్ధితో పాటు నేత కార్మికుల శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు.

మీ సేవ కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవాలి