యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి.
డీసీసీబీ చైర్మన్ కుంభం
శ్రీనివాస్‌రెడ్డికి ఉత్తమ అవార్డు
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే మంచి ఫలితాలు సాధించడంతో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ఉత్తమ అవార్డు అందజేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే నల్లగొండ డీసీసీబీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రసంసించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శంకర్‌రావు, రవీందర్రావు, సురేంద్రమోహన్, ఉదయభాస్కర్ ఉన్నారు.
ఎంఎంటీఎస్ నిధుల
మంజూరుకు కేంద్రం సిద్ధం
భువనగిరి : ఎంఎంటీఎస్ నిర్మాణ పనులు చేపట్టేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ అన్నారు. భువనగిరి మండలం మాసుకుంట వద్ద జరుగుతున్న ఎంఎంటీఎస్ రైల్వేలైన్ పనులను మంగళవారం ఆయన పలువురు నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, శ్యాంసుందర్‌రెడ్డి, అచ్చయ్య, సుర్వి శ్రీనివాస్, మహమూద్, శ్రీశైలం, శ్రవణ్, మంగు నర్సింగ్‌రావు, సంతోష్ తదితరులు ఉన్నారు.
ఆలేరు ఏడీఏ పద్మావతికి డీడీఏగా పదోన్నతి
ఆలేరు: ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకురాలు(ఏడీఏ) పద్మావతికి డిప్యూటీ డెరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (డీడీఏ)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆమెను నిజామాబాద్ జిల్లా రైతు శిక్షణ కేంద్రాని(ఎఫ్‌టీసీ)కి బదిలీ చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఆలేరు ఏడీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలేరు, గుండాల, మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడురు మండలాల ఏఓలు, ఏఈలు, ఫర్టిలైజర్ డీలర్లు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఏఓలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఓలు శ్రీనివాస్‌గౌడ్, పాండురంగాచారి, శ్రీనివాస్, కీర్తి, పూజా, ఫర్టిలైజర్ దుకాణాల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవి, యాదాద్రి జిల్లా కోశాధికారి పడిగల రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
మోత్కూరు సంఘానికి అభివృద్ధి నిధులు
మోత్కూరు : ఫార్మర్ ప్రొక్యూర్‌మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద మోత్కూరు సింగిల్‌విండోకు మొదటి విడతలో భాగంగా రూ.3.16లక్షల నిధులు మంజూరయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లుకు నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా చెక్కు అందజేశారు. సంఘం చైర్మన్ మాట్లాడుతూ ఏడాదికి రూ.6లక్షల చొప్పున మూడేళ్లకు రూ.18లక్షలు అందజేస్తారని తెలిపారు.
ఆంజనేయస్వామికి ఆకుపూజ