
వెల్లంకిలో తమిళనాడు బృందం పర్యటన
రామన్నపేట : తమిళనాడు రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పర్యటించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధి అనిల్‌కుమార్, తమిళనాడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి డాలస్ న్యూ బిగిన్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం మెరుగునకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. రైతు వేదికలో రైతునేస్తం పోగ్రామ్‌ను వీక్షించి పలు అంశాలపై రైతులతో చర్చించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య స్థాపించి నిర్వహిస్తున్న ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని సందర్శించారు. ఉన్నత పాఠశాలలో డిజిటల్ పాఠాల బోధన, మధ్యాహ్న భోజన పథకం అమలును తీరును తెలుసుకున్నారు. పల్లెప్రకృతి వనం, గ్రామ నర్సరీలను సందర్శించారు. స్వయం సమృద్ధి విభాగంలో జాతీయ స్థాయి అవార్డుకు పోటీ పడిన వెల్లంకిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బృందం సభ్యులు అధ్యయనం చేశారు. వారివెంట డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్ ఎంపీడీఓ ఎ.రాములు, ఎంపీఓ రవూఫ్‌అలీ, ప్రత్యేక అధికారి ఆశీష్ రాఘవ, ఏపీఓ పి.వెంకన్న, పంచాయతీ కార్యదర్శి మోహన్ తదితరులు ఉన్నారు.
ఫ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా