
వరదొస్తే.. రాకపోకలు బంద్
ఫ లో లెవల్ వంతెనల పైనుంచి ప్రవాహం
ఫ వర్షాకాలంలో ఊరు దాటలేని దుస్థితి
ఫ వాగుదాటే క్రమంలో ప్రమాదాలు
ఫ ప్రతిపాదనల్లోనే హైలెవల్ బ్రిడ్జీలు
ఇక్కడ కనిపిస్తున్న వంతెన రాజాపేట–కుర్రారం మధ్యలోనిది. సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. 2021 ఆగస్టులో ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఇద్దరు యువతులు గల్లంతై మృతి చెందారు. మరికొందరు ప్రమాదాల బారిన పడ్డారు. అయినా హై లెవల్ బ్రిడ్జి నిర్మించడం లేదు.
యాదగిరిగుట్ట రూరల్: వానొస్తే ఊరు దాటలేని పరిస్థితి నెలకొంటుంది. పలుదారుల్లో ఉన్న లోలెవల్ వంతెనల పైనుంచి వాగులు ఉధృతంగా పారుతుండటంతో రోజుల తరబడి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. వాగుదాటే క్రమంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొందరు గాయాలతో బయటపడ్డారు. ఎప్పుడో నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారాయి. ఆలేరు నియోజకవర్గంలోని దాదాపు 60 గ్రామాల పరిధిలో ఈ సమస్య ఉంది. 11 పాత వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు అధికారులు ప్రతి పాదనలు పంపించారు. అందులో మూడు వంతెనలకు మూడేళ్ల క్రితం నిధులు మంజూరు కాగా.. ఆలేరు–కొలనుపాక బ్రిడ్జికి ఇటీవల మోక్షం లభించింది.
రాకపోకలు బంద్
● ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, మోటకొండూర్, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో 73 లో లెవల్ వంతెనలు ఉన్నాయి. మోస్తరు వర్షం కురిసినా వాగులు, వంకలు పొంగి రోడ్లపైనుంచి నీరు పారుతుంది.
● ఆలేరు–కొలనుపాక మధ్య వాగుదాటే క్రమంలో రాజాపేట మండలం నెమిలె గ్రామానికి చెందిన మంత్రి వెంకటయ్య–అరుణ దంపతులు ద్విచక్రవాహనంతో సహా కొట్టుకపోయారు. స్ధానికులు వారిని రక్షించారు. హెదరాబాద్‌కు చెందిన దేవదాసు – దేవేంద్ర దంపతులు బైక్‌పై వెళ్తూ వాగులో పడిపోయారు. స్థానికులు వారిని కాపాడారు. వీరితో పాటు పదుల సంఖ్యలో కొట్టుకుపోయి ప్రాణాలతో బయటపడ్డారు.
● గుండాల–నూనెగూడెం మధ్య కాజ్‌వే పూర్తిగా ధ్వంసమైంది.
● యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించిన ప్రతీసారి గ్రామస్తులు, రైతులు 15 కిలో మీటర్లు తిరిగి వెళ్తున్నారు.
● దాతర్‌పల్లి, జంగంపల్లి, రాళ్లజనగాం గ్రామస్తులు యాదగిరిగుట్టకు వచ్చే క్రమంలో గొల్లగుడిసెల వద్ద ఉన్న లో లెవల్ వంతెన దాటలేకపోతు న్నారు. పలువురు వాహనదారులు ప్రమాదాలబారిన పడ్డారు.
● రాజాపేట–కుర్రారం వద్ద వాగుదాటే క్రమంలో గల్లంతై ఇద్దరు యువతులు మృతి చెందారు.

వరదొస్తే.. రాకపోకలు బంద్

వరదొస్తే.. రాకపోకలు బంద్