
కొండమడుగు కార్యదర్శి సస్పెన్షన్
బీబీనగర్: మండలంలోని కొండమడుగు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టడంతో పాటు సుమారు రూ.93,40,377 దుర్వినియోగం తదితర ఆరోపణలపై మూడు నెలల క్రితం డీఎల్‌పీ విచారణ నిర్వహించారు. నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారించి డీపీఓకు నివేదిక అందజేశారు. అయినా ఇప్పటికే పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ‘నిధులు పక్కదారి – ఏదీ రికవరీ’ శీర్షికతో ఈనెల 6న సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు స్పందించిన కలెక్టర్.. పంచాయతీ కార్యదర్శి అలివేలును సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా గ్రామ ప్రత్యేకాధికారిగా ఉన్న ఏంపీఓ మదీద్‌కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు. మదీద్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలని డిప్యూటీ సీఈఓ విష్ణువర్దన్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో నిధుల ఖర్చుపై విచారణ జరపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుకు సూచించారు. అధికారులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
సమగ్ర విచారణ చేయించాలి
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చూసి కొండమడుగు గ్రామస్తులకు పెద్ద సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.
ఫ ప్రభుత్వ నిధుల
దుర్వినియోగానికి మూల్యం
ఫ ‘సాక్షి’ కథనంతో స్పందించిన కలెక్టర్

కొండమడుగు కార్యదర్శి సస్పెన్షన్