
కామునిగూడెం.. ప్రగతికి దూరం
ఆత్మకూర్(ఎం): ఆత్మకూర్(ఎం) పంచాయతీ పరిధిలోని కామునిగూడెం మౌలిక సదుపాయా లకు దూరంగా ఉంది. గ్రామం ఏర్పడి సుమారు 60 ఏళ్లు అవుతున్నా నేటికీ రోడ్డు సౌకర్యం లేదు. చిన్నపాటి మట్టిబాట గుండానే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వర్షాకాలంలో సమస్య మరీ అధ్వానం. ద్విచక్ర వాహనంపై కూడా వెళ్లలేని పరిస్థితి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు మా ప్రభుత్వం వస్తే కొత్త రోడ్డు వేస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పనికి ఆత్మకూర్ వెళ్లాల్సిందే..
కామునిగూడెంలో 70 కుటుంబాలు, 450 జనాభా ఉంది. గ్రామస్తులకు ఏ చిన్న అవసరం వచ్చినా ఆత్మకూర్(ఎం)కు వెళ్లాల్సిందే. రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడంతో మండల కేంద్రానికి మూడు కిలో మీటర్లు నడవాల్సిందే. గ్రామంలో పాఠశాల మూతపడటంతో విద్యార్థులు ఆత్మకూరు(ఎం) పోతుంటారు.ఉన్నతచదువుల కోసం భువనగిరికి వెళ్లొస్తుంటారు. ఆత్మకూరు(ఎం)నుంచి కామునిగూడెం చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్, భువనగిరిలోని హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు.ఇక నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యం, ఉపాధిహామీ డబ్బులు,ఆసరా పింఛన్ తీసుకోవాల న్నా మండల కేంద్రం పోవాల్సిందే. దీంతో వృద్ధులు, దివ్యాంగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్తే రానుపోను ఒక్కరికి రూ.200 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా సరైన తాగునీటి వసతి లేకపోవడం వంటి సమస్యలతో గ్రామస్తులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లాలంటే అవస్థ..
రాత్రి వేళల్లో, అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే అవస్థలు వర్ణనాతీతం. మట్టి రోడ్డు కావడంతో ప్రైవేట్ వాహనాలు కూడా రాలేని పరిస్థితి. ఆటో కిరాయికి తీసుకొని లేదా, ద్విచక్ర వాహనాలపై పోవాల్సిందే. రవాణా సౌకర్యం లేని కారణంతో ఆశ కార్యకర్త కూడా రావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
60 ఏళ్లుగా మట్టి రోడ్డే దిక్కు
ప్రైవేట్ వాహనాలూ తిరగవు
చదువులకు దూరమవుతున్న విద్యార్థులు
అత్యవసర సమయాల్లో నరకయాతన
రేషన్ బియ్యం, పింఛన్, నిత్యావసర సరుకులకు వెళ్లాలన్నా తిప్పలే
అమలుకు నోచని నేతల హామీలు

కామునిగూడెం.. ప్రగతికి దూరం

కామునిగూడెం.. ప్రగతికి దూరం