
ట్రిపుల్ ఐటీ కల సాకారమయ్యేనా..?
రామన్నపేట: ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలగానే మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి జిల్లా ఉన్నత విద్యాసంస్థల పరంగా కొంత వెనుకబడే ఉందని చెప్పవచ్చు. విద్యాసంస్థల ఏర్పాటు పరంగా వెనుకబడిన నల్లగొండ జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) బాసరలో, కోస్తా ఆంధ్రా ప్రాంతంలో అప్పటి కృష్ణా జిల్లాలోని(ప్రస్తుతం ఏలూరు జిల్లా) నూజివీడులో, రాయలసీమలో కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపిక సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్దులకు 24 మార్కులను లేదా 0.4 జీపీఏ కలిపి మెరిట్ తీస్తారు. తెలంగాణలో బాసరలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ)లో ప్రతి సంవత్సరం 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ప్రీ యూనివర్సిటీ కోర్సును(ఇంటర్ సమానం)అభ్యసిస్తారు. పీయూసీ కోర్సులో సాధించిన మెరిట్ ఆధారంగా బీటెక్ కోర్సులో ప్రవేశం కల్పిసారు.
మరో రెండుచోట్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు
బాసరలోని ఆర్‌జీయూకేటీకి అనుబంధంగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ప్రాధాన్యతగా మహబూబ్‌నగర్‌లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాల కొరకు నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. మొదటి విద్యాసంవత్సరంలో 181మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూ ఈ నెల 4న ఎంపిక జాబితాను ప్రకటించారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఎంపికై న విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి నెలలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను క్యాంపస్ ఏర్పాటు కోసం పరిశీలించినట్లు తెలుస్తోంది.
బాసర ఆర్‌జీయూకేటీకి అనుబంధంగా రాష్ట్రంలో క్యాంపస్‌ల విస్తరణ
ఈ ఏడాది మహబూబ్‌నగర్‌లో
క్యాంపస్ ప్రారంభం
అందులో కొనసాగుతున్న అడ్మిషన్లు
వచ్చే ఏడాది హన్మకొండ జిల్లా
ఎల్కతుర్తిలో మరో క్యాంపస్
ప్రారంభించే అవకాశం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ
ఏర్పాటు చేయాలని డిమాండ్
నల్లగొండకు అవకాశం దక్కేనా..?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహత్మాగాంధీ విశ్వవిద్యాలయం మినహా పేరొందిన ప్రభుత్వ విద్యాసంస్థలు పెద్దగా ఏమీ లేవు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా అంతంతమాత్రమే. సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఇతర జిల్లాల విద్యార్థులు వచ్చిపోవడానికి అనువైన జాతీయ రహదారులు, రైల్వే లైన్లు కూడా ఉన్నాయి. తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్‌లో గల ఎంజీ యూనివర్సిటీ తాత్కాలిక భవనాలను ఉపయోగించవచ్చు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలోని 12మంది ఎమ్మెల్యేల్లో 11మంది అధికారపక్షానికి చెందిన వారే కాగా.. అందరూ సమష్టిగా కృషి చేసి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఉమ్మడి జిల్లాకు సాధించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.