
భర్త వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య
భువనగిరి: భర్త వేధింపులు భరించలేక ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం భువనగిరి పట్టణంలో జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల కేంద్రానికి చెందిన వంగాల బాబు, నీరటి కవిత(30) 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంఎస్సీ పూర్తిచేసిన కవిత భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించగా.. బాబు ఎలాంటి పనిచేయకుండా ఖాళీగా ఉండేవాడు. ఈ క్రమంలో కవితకు రెండుసార్లు అబార్షన్ సైతం అయ్యింది. దీంతో ఇద్దరు కలిసి కొంతకాలం హైదరాబాద్‌కు వెళ్లారు. బాబు ఓ బ్యాంకులో ఉద్యోగంలో చేరగా.. కవిత ఇంటి వద్దనే ఉండేది. ఈ క్రమంలో కవిత మరోసారి గర్భం దాల్చింది. దీంతో నెల రోజు క్రితం భువనగిరికి తిరిగి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. బాబు భువనగిరికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం కవిత నాలుగు నెలల గర్భవతి. బాబు వరకట్నం తీసుకురావాలని కవితను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బ్యాంకు వెళ్లిన బాబు తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా కవిత తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. అప్పటికే కవిత చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యాదాద్రి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భర్త వేధించడంతో పాటు అతడే కవితకు ఉరి వేసి హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.