
నెమలి, జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
వేములపల్లి: జాతీయ పక్షి నెమలి, జింక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని వేములపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ కూలీ పనులతో పాటు చేపలు, కుందేళ్లు, అడవి పందుల వేటకు వెళ్తుంటాడు. అతడు తనకు పరిచయమున్న రాజు అనే వ్యక్తి నుంచి జింక, దుప్పి మాంసాన్ని తీసుకొచ్చి ఇంట్లో అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు మార్చి 23న వేములపల్లి ఎస్‌ఐ అతడి ఇంటిపై దాడి చేయగా పారిపోయాడు. దీంతో రమేష్‌పై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రెండు ఎయిర్ రైఫిల్స్, 3 కత్తులు, 5 అడవి పందుల వేటకు సంబంధించిన వలలు, 15 కుందేళ్ల వేటకు సంబంధించిన ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, వేములపల్లి ఎస్‌ఐ డి. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.