
వేదాలకు నిలయంగా యాదగిరి క్షేత్రం
యాదగిరిగుట్ట: వేదాలకు నిలయంగా ఉండాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంత వేద పాఠశాలను సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం యాదగిరి కొండకు సమీపంలో ఉన్న టెంపుల్ సిటీపై నిర్మించనున్న వేద పాఠశాల చుట్టూ ప్రాకారం(ప్రహరీ) ఏర్పాటు చేసేందుకు ఈఓ వెంకట్రావ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో రూ.46కోట్లతో వేద పాఠశాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వేద పాఠశాల ప్రాకారం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యాదగిరి క్షేత్రం అభివృద్ధితో పాటు భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి దృఢంగా సంకల్పిస్తున్నారన్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా వేద పాఠశాల నిర్మాణం చేసే స్థలంలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ వెంకట్రావ్, ఆలయాధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య