ఉజ్వల భవిష్యత్‌కు నవోదయం
పరీక్ష విధి, విధానాలు
ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో మూడు విధాలుగా ఉంటుంది. మూడు విభాగాల్లో కలిపి 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు చొప్పున కేటాయిస్తారు. ప్రతి విభాగంలోనూ లఘుప్రశ్నలు( ఆబ్టెక్టివ్ టైప్) ఉంటాయి. రీజనింగ్ (మేథోశక్తి)పై 40 ప్రశ్నలకు 50 మార్కులు (60 నిమిషాల కాలవ్యవధి), గణితంపై 20ప్రశ్నలకు 30 నిమిషాలు, భాషా పరిజ్ఞానంపై 20 ప్రశ్నలకు 30 నిమిషాలు, మొత్తం రెండు గంటల్లో 80 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు సమాధానాలను ఐసీఆర్/ఓఎంఆర్ పత్రంలో పూరించాలి. ప్రవేశ పరీక్షకు ఇంకా 6 నెలల సమయం ఉన్నందున విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివితే విజయం సాధించడం సులభమవుతుంది.
పెద్దవూర: నవోదయ విద్యాలయాల్లో 2026– 2027 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవటానికి జూలై 29 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష 2025 డిసెంబర్ 13 తేదీన నిర్వహించనున్నారు.
ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య
నవోదయ విద్యాలయంలో తమ పిల్లలకు సీటు రావాలని చాలా మంది తల్లిదండ్రులు పోటీపడతారు. గ్రామీణ ప్రాంత ప్రతిభావంతమైన విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను అందిచటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నల్లగొండ జిల్లా చలకుర్తి గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, బాల, బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పించారు. విద్యాబోధన 6 నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాషలో జరుగుతుంది. గణితం, సైన్స్ సబ్జెక్టులు ఆంగ్లభాషలోనూ, సామాజిక శాస్త్రములు హిందీలోనూ బోధిస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 80 మంది విద్యార్థులు, 11, 12 తరగతుల్లో 40 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం
విద్యార్థులు ఽఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించిన తర్వాతనే వెబ్‌సైట్‌లో నందు అప్‌లోడ్ చేసి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. 5వ తరగతి ఏ పాఠశాలలో చదువుతున్నారో అక్కడి నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకుని అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫారంపై విద్యార్థి, తండ్రి సంతకాలు తప్పకుండా ఉండాలి. ఫొటో కూడా అప్‌లోడ్ చేయాలి. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు www. jnvnalgonda. in లేదా www. navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవటానికి జూలై 29 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
అర్హతలు
ప్రవేశం కోసం విద్యార్థులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతూ 01.05.2014 నుంచి 31.07.2016ల మధ్య జన్మించిన వారు అర్హులు. ఈ నిబంధన ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. ప్రవేశ పరీక్ష 2025 డిసెంబర్13 తేదీన ఉదయం 11.30 నుంచి 1.30 వరకు రెండు గంటల పాటు నిర్వహిస్తారు.
రిజర్వేషన్ విధానం
ఆరో తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించాలంటే 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లోనూ, మున్సిపాలిటీల్లో చదివినా గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించదు. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బాలికలకు మొత్తం సీట్లలో 1/3 వ రిజర్వేషన్ సౌలభ్యం ఉంది.
పరీక్ష మాధ్యమం
అభ్యర్థి 5వ తరగతిలో ఏ మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తారో.. ఆ భాషలోనే పరీక్ష ఉంటుంది. అభ్యర్థి తాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఫారం, ప్రవేశ పత్రంలో పేర్కొన్న భాషలోనే టెస్ట్ బుక్‌లెట్ ఇస్తారు. దరఖాస్తు ఫారంలోనూ, ప్రవేశ పత్రంలో పరీక్షా మాధ్యమం ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
ఫ చలకుర్తి నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఫ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
సమర్పించేందుకు
జూలై 29 వరకు గడువు
ఫ ఉమ్మడి జిల్లాకు 80 సీట్లు
కష్టపడితే సీటు ఖాయం
విద్యార్థులు ప్రణాళికతో కష్టపడితే సీటు సాధించవచ్చు. ముఖ్యంగా రీజనింగ్‌లో అన్ని ప్రశ్నలు కరెక్ట్‌గానే అనిపిస్తాయి. కొంచెం లోతుగా ఆలోచించటం, బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుంది. తక్కువ సమయంలో సమాధానం చేయాలి కాబట్టి సాధన ముఖ్యం. ఇందులో సీటు వస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పారదర్శకంగా నిర్వహిస్తాం. ప్రశ్నపత్రం తయారీ నుంచి విద్యార్థుల ఎంపిక వరకు జరిగే అన్ని ప్రక్రియలను సీబీఎస్‌ఈ వారే నిర్వహిస్తారు.
– ఎదునందన్, చలకుర్తి జేఎన్‌వీ ప్రిన్సిపాల్


