
రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు
నార్కట్‌పల్లి: ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పోతోందని, రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులు రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారని తెలిపారు. తెలంగాణ దివాలా తీసి వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్‌రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రోజురోజుకు కుమ్ములాటలు బయటికి వస్తున్నాయన్నారు. 30 శాతం పర్సంటేజీ ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవెర్చలేక పరిపాలన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కమిషన్ నోటీసు కుట్రలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లు ఇప్పటి వరకు 40 శాతం కూడా జరగలేదని, కేంద్రాల వద్ద కుప్పలు వానకు తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, యానాల అశోక్‌రెడ్డి, కొండూరు శంకర్, తరాల బలరాం, జ్యోతి బలరాం, కోటిరెడ్డి, సుధీర్, సతీష్, దుబ్బ మధు, సత్తిరెడ్డి, ప్రకాష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య