
భార్యలను ఇంట్లో నుంచి గెంటేసిన తండ్రి, కొడుకు
నార్కట్‌పల్లి: తమ భార్యలను తండ్రి, కొడుకు ఇంట్లో నుంచి గెంటివేయగా.. తమకు న్యాయం చేయాలని అత్త, కోడలు కలిసి ఇంటి ఎదుట దీక్షకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన బద్దుల మల్లేష్ ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతడి మొదటి భార్య క్యాన్సర్‌తో మృతిచెందడంతో 2012లో యాదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మల్లేష్‌కు, అతడి మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో భార్యతో సంతానం కలగలేదు. కొంతకాలం మల్లేష్, అతడి రెండో భార్య యాదమ్మ కాపురం సజావుగానే సాగింది. పిల్లల పెళ్లిళ్లు అయిన తర్వాత యాదమ్మను మల్లేష్ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. మల్లేష్ మొదటి భార్య కుమారుడైన బద్దుల మహేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఏపీలోని విజయవాడకు చెందిన దుర్గామల్లేశ్వరీని వివాహం చేసుకున్నాడు. అయితే మహేష్ కూడా తన భార్య దుర్గామల్లేశ్వరీతో పాటు మూడేళ్ల కుమారుడిని ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తమను ఇంట్లోకి రానీయకుండా తండ్రి, కొడుకు ఇంటికి తాళం వేసి వెళ్లడంతో తమకు న్యాయం చేయాలని గురువారం అత్త యాదమ్మ, కోడలు దుర్గామల్లేశ్వరి కలిసి నార్కట్‌పల్లిలోని మల్లేష్ ఇంటి ఎదుట దీక్షకు దిగారు. పెళ్లి సమయంలో తన తల్లిగారు కిలో బంగారంతో పాటు విజయవాడలో ఓ ప్లాట్ ఇచ్చారని, తాను ఏం తప్పు చేశానని ఇంటి నుంచి వెళ్లగొట్టారని దుర్గామల్లేశ్వరీ కన్నీటి పర్యంతమైంది. వీరికి ఐద్వా నాయకురాళ్లు అండగా నిలిచారు. జల్సాలకు అటుపడి భార్యలను ఇంట్లో నుంచి గెంటేసిన తండ్రి మల్లేష్, కొడుకు మహేష్‌ను అరెస్ట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సరోజ, నాగమణి డిమాండ్ చేశారు.
ఇంటి ముందు ధర్నాకు
దిగిన అత్త, కోడలు