
సస్యశ్యామలం చేస్తాం
ఫ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి
ఫ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఫ ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖపై మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం
ఫ హాజరైన గుత్తా, మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులంతా సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పా రుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎస్‌పీ కన్వెన్షన్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సాగునీటి, పౌరసరఫరాల శాఖ (వరి ధాన్యం సేకరణ, సన్న బియ్యం పంపిణీ)పై సమీక్ష నిర్వహించారు. ముందుగా తెలంగాణ గీతం ఆలపిస్తుండగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికా రులంతా గౌరవ సూచికంగా లేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.94వేల కోట్లు ఖర్చు చేసిందని, ఆ నిధులతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ గత ప్రభుత్వం ట్రిబ్యునల్‌తో ఒప్పందం చేసుకుందని, సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న 811 టీఎంసీల నీటిని 512 టీఎంసీలు ఏపీకి, 298 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా గత ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ రీఓపెన్ చేసి పునఃపరిశీలన చే యాలని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోందని తెలిపారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను తామే పూర్తి చేస్తామని, నిర్లక్ష్యానికి గురైన డిండి ప్రాజెక్టుకు గాను రూ.1,800 కోట్లు కేటాయించామన్నారు. ఈ యాసంగిలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం పథకం తెచ్చామన్నారు.
సాగునీటి పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తి
సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో సాగునీటి పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్‌నంద్‌లాల్, భూసేకరణ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్‌కృష్ణారెడ్డి, నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్, అడిషనల్ డీ జీపీ చౌహాన్, తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీని వాస్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరమ్మతులకు నిధులివ్వాలి
–శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడమకాల్వ మరమ్మతుకు నిధులు కేటాయించాలని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ మెయిన్ కెనాల్‌కు రూ.440కోట్లు మంజూరు చేశారని, మరో 3, 4 కిలోమీటర్లు ప్రధాన కాల్వ లైనింగ్ పెంచితే 2లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ నుంచి నల్లగొండకు అక్రమంగా వస్తున్న ధాన్యం రవాణాలను అరికట్టాలని అధికారులకు సూచించారు.
మాది పేదల ప్రభుత్వం
– ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజా ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అన్నింటి కంటే సన్న బియ్యం పంపిణీ పథకం తమకు నచ్చిందన్నారు. పదేళ్ల పాటు ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్ కాంగ్రెస్‌ను విలన్‌గా చూపించడం అతని అసహనానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రూ. 150 కోట్లు కేటాయించామన్నారు. జూన్‌లో టెండర్లు పిలిచి జూలైలో పనులు ప్రారంభిస్తామన్నారు.