
తల్లిదండ్రుల కలను నిజం చేస్తూ..
చివ్వెంల(సూర్యాపేట) : గిరి పుత్రిక జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తల్లిదండ్రుల కల సాకారం చేసింది. గతంలో ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపికకానప్పటికీ.. నిరుత్సాహపడకుండా ఈ సారి కష్టపడి చదివి జడ్జి పీఠంపై కూర్చుంది. చివ్వెంల మండలం రాజునాయక్ తండాకు చెందిన ధరావతు భాస్కర్, సంధ్య దంపతులకు కుమారుడు నిఖిల్‌నాయక్, కుమార్తె సుష్మ సంతానం. భాస్కర్ అడ్వకేట్ల వద్ద క్లర్క్‌గా పనిచేస్తూ తన కుమారుడు, కుమార్తెను లా చదివించాడు. అయితే రెండేళ్ల క్రితం కుమారుడు నిఖిల్‌నాయక్ మృతిచెందడంతో.. కుమార్తెను జడ్జిని చేసేందుకు శిక్షణ ఇప్పిస్తూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పదో తరగతి వరకు సూర్యాపేటలో చదివిన సుష్మ, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సులో చేరి 2020లో లా పూర్తి చేసింది. అనంతరం 2020లో సూర్యాపేట బార్ అసోషియేషన్‌లో సభ్యత్వం తీసుకుని, రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ.. జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు కోచింగ్ తీసుకుంది. 2022లో సుష్మ మొదటిసారి జూనియర్ సివిల్ జడ్జి ఎంపికలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపిక కాలేదు. అయినా నిరుత్సాహపడకుండా 2024 జూలైలో నిర్వహించిన ప్రిలిమ్స్‌లో, నవంబర్‌లో నిర్వహించిన మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న నిర్వహించిన ఇంటర్వ్యూలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఏప్రిల్ 30న వెల్లడించిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో సెలక్ట్ అయ్యింది. తన తలిదండ్రుల కల సాకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని సుష్మ పేర్కొంది. తమ కుమార్తె జడ్జిగా ఎంపిక కావడంతో సుష్మ తల్లిదండ్రులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సుష్మను గ్రామస్తులతో పాటు మండల ప్రజలు అభినందించారు.
జూనియర్ సివిల్ జడ్జిగా
ఎంపికై న గిరి పుత్రిక