
జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. శుక్రవారం యాదగిరి కొండపైన గల తన కార్యాలయంలో ఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ శాఖలు, ఎస్‌పీఎఫ్ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన ఉదయం స్వస్తి వాచనంతో శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన, తిరు వెంకటపతి అలంకార సేవ ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ నిర్వహిస్తామన్నారు. 10వ తేదీన ఉదయం లక్ష పుష్పార్చన పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కాళీయ మర్థన అలంకార సేవను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు.సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీరామావతార అలంకార సేవను ఊరేగించనున్నట్లు వెల్లడించారు. 11వ తేదీన మహా పూర్ణాహుతి చేసి, సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 7గంటలకు విశేష తిరువారాధన, అర్చన, వేద స్వస్తీ, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠితో ఉత్సవ సమాప్తి ఉంటుందని పేర్కొన్నారు. శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9 నుంచి 11 వరకు ఆలయంలో భక్తులచే జరిపించే నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీసుదర్శన నారసింహ హోమం, జోడు సేవను రద్దు చేసినట్లు తెలిపారు.
భక్తుల సౌకర్యాలపై దృష్టి సారిస్తా
వేసవిలో భక్తులు శ్రీస్వామి వారి చెంతకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చలువ పందిర్ల ఏర్పాటు, మంచి నీటి సౌకర్యం కల్పించే అంశాలపై దృష్టి సారిస్తామని ఈఓ వెంకట్రావ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు యాదగిరి క్షేత్రాన్ని సైతం ఈ నెల 15వ తేదీన సందర్శించనున్నట్లు, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్