నిరుపేదలకు అన్యాయం చేశారు

ఆలేరులో రాస్తారోకో చేస్తున్న దరఖాస్తుదారులు   
 - Sakshi

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల

దరఖాస్తుదారుల రాస్తారోకో

ఆలేరురూరల్‌ : డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల దరఖాస్తుదారులు ఆలేరులో రోడ్డెక్కారు. నిరుపేదలను కాదని అనర్హులను ఎంపిక చేశారంటూ కౌన్సిలర్‌ సమంతక ఆధ్వర్యంలో రైల్వేగేట్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్లన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని, అసలైన పేదలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తులను పారదర్శకంగా విచారణ చేయకుండా ముందుగా ఎంచుకున్న పేర్లను జాబితాలో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రజాప్రతినిదులు, అధికారులు చేతివాటం ప్రదర్శించి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. జాబితాలో వచ్చిన పేదల పేర్లను రాత్రికిరాత్రే తొల గించారని పేర్కొన్నారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని ఎంతో ఆశతో ఎదురు చూశామని, చివరికి అన్యాయం చేశారని వాపోయారు. ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని స్పష్టం చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం దరఖాస్తుదారులు అక్కడి నుంచి వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నిరుపేదలం అయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ ఇద్రీస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దరఖాస్తుదారులు గౌరవరపు అరుణ, కుడికాల నాగలక్ష్మి, ఎండీ సర్వర్‌, గుర్జకుంట మంజుల, సల్మాబేగం, సఫియాబేగం, మడూరి సోమలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top