సామాన్యులకు అందుబాటు ధరల్లో..
ఒకే ఒక్క ప్రశ్న.. ఆమె ఆలోచనలకు పదును పెట్టింది.. అంధుల జీవితాల్లో వెలుగులు నింపే ముద్రణా యంత్రానికి నాంది పలికింది.. ‘బ్రెయిలీ లిపిలో బటన్స్ నొక్కడానికి బదులు మేం మాట్లాడితే అక్షరాలు వచ్చే సాంకేతికత రాదా’ అంటూ ఓ అంధ విద్యార్థి అమాయకంగా అడిగిన ప్రశ్నకు పరిష్కారం ఆ ఇంజనీరింగ్ విద్యార్థినికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. బ్రెయిలీ లిపిని మరింత సులభతరం చేసే ‘రుద్ర’ ముద్రణ యంత్రాన్ని ఆవిష్కరింపజేసింది.
● అంధుల జీవితాల్లో వెలుగులు
● సరికొత్త ముద్రణా యంత్రం ఆవిష్కరణ
● అంతర్జాతీయ స్థాయి పోటీలకు బీటెక్ విద్యార్థిని హిమజ ప్రాతినిధ్యం
భీమవరం : ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన లింగంపల్లి కిషోర్‌కుమార్, వాణి దంపతుల కుమార్తె హిమజ భీమవరం విష్ణు ఉమెన్స్ కళాశాలలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతోంది. కాలేజీలో మా మూలుగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆమె రెండేళ్ల కిత్రం పట్టణంలో నేత్ర వైద్యుడు యూవీ రమణరాజు నిర్వహిస్తున్న అంధుల పాఠశాలను సందర్శించింది. ఆ సమయంలో ఓ అంధ విద్యార్థి స్లేట్ పిన్‌తో కాగితాన్ని ఒక్కో చుక్కగా గుచ్చుతూ బ్రెయిలీ రాయడం ఆమె దృష్టిలో పడింది. సాంకేతికత ద్వారా బ్రెయిలీ రాయడంలో అంధ విద్యార్థులకు శారీరక శ్రమను తగ్గించి సులభతరం ఎలా చేయాలనే దానిపై ఆలోచన చేసింది.
స్వరంతో పనిచేసే యంత్రం
‘బ్రెయిలీని సులభంగా రాయలేమా’ అన్న ఆలోచన ఆమెను బ్రెయిలీ ప్రింటర్‌ను తయారుచేసేందుకు ప్రేరణ కలిగించింది. ఆమె ప్రయత్నం ‘రుద్ర’ ముద్రణ యంత్రంగా రూపుదిద్దుకుంది. ముందుగా హిమజ అ లెక్సాను ఉపయోగించి సిస్టమ్ లో వాయిస్ ఇన్‌పుట్‌ను ఎలా పొందుపర్చవచ్చో అన్వేషించడం ప్రారంభించి బటన్స్ ఆ ధారిత నమూనాని వాయిస్ ద్వారా పనిచేసే బ్రెయిలీ ప్రింటింగ్ పరికరంగా మార్చింది. దీని ద్వారా అంధులు మాట్లాడిన మాటలను బ్రెయిలీలోకి మార్చి దానికి సంబంధించిన అక్షరాలను ముద్రించవచ్చు. ఈ యంత్రం ఇచ్చే బ్రెయిలీ నమూనాలను వాటి అసలు రూపంలో స్పర్శించి చదవవచ్చని, దీనివల్ల కాగితాలను తిప్పడం, చదవడానికి ముందు దానికి సంబంధించిన నమూనాని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదని హిమజ తెలిపింది.
ఏడాదిన్నర కృషి
ఇంజనీరింగ్ డ్రాయింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెన్సార్స్ వంటి అంశాలు ఈ యంత్రాన్ని అభివృద్ధి చేయడంలో తనకు సహాయపడ్డాయని, దాదాపు ఏడాదిన్నర సమయం, రూ.1.50 లక్షల వ్యయమయ్యిందని హిమజ తెలిపింది. విష్ణు కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం, అధ్యాపకుల సహాయంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసినట్లు ఆమె చెప్పింది.
రూ.6 లక్షల బహుమతి
ఈ ఆవిష్కరణ ఆన్‌లైన్ పోటీలో మన దేశంలో జేమ్స్ డైసన్ అవార్డుతోపాటు రూ.6 లక్షల నగదు బహుమతి గెలుచుకుంది. అంతర్జాతీయస్థాయి పో టీలో హిమజ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుండటం తమ విద్యాసంస్థకు గర్వకారణమని శ్రీవిష్ణు విద్యాసంస్థల చైర్మన్ కె.విష్ణురాజు చెప్పారు. హిమజ చదువుతో పాటు కూచిపూడి, శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ పొందడమేగాక పలు ప్రదర్శనలిచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. గిటార్‌లో ప్రావీణ్యంతో పాటు త్రోబాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంది.
ప్రస్తుత వెర్షన్ తయారీకి ప్రోటోటైప్‌ను స్థిరంగా, సమర్థవంతంగా చేయడానికి బరువైన లోహాన్ని, ఇతర ప్రామాణిక భాగాలను ఉపయోగించడం వల్ల ఖర్చు ఎక్కువైందని, ప్రత్యేకంగా విద్యార్థుల ఉపయోగం కోసం వేర్వేరు అంశాలతో పునః రూపకల్పన చేస్తే ధరను సుమారు రూ.50 వేలకు తగ్గించే అవకాశముందని హిమజ తెలిపింది. ప్రస్తుత యంత్రంలో ప్రింటర్ హెడ్ ఎక్స్, వై అక్షరాలపై కదులుతుండగా కాగితం స్థిరంగా ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఈ పరికరాన్ని ప్రయాణానికి అనుకూలంగా మరింత చిన్నదిగా తేలికై ందిగా ప్రింటర్ హెడ్ స్థిరంగా ఉండి కాగితం మాత్రమే కదిలే డిజైన్‌ను కూడా అన్వేషిస్తున్నట్టు చెప్పింది.


