పరిహారం.. పరిహాసం | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

పరిహారం.. పరిహాసం

ధర పెంచితేనే భూములిస్తాం

బుట్టాయగూడెం : చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ బాధితులు గత ఎనిమిదేళ్లుగా పరిహారం సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. 2018లో చింతలపూడి ఎత్తిపోతల పథకం సబ్‌ కెనాల్‌ (పంట కాల్వ) పనుల నిమిత్తం సుమారు 200 మంది రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించి అవార్డు పాస్‌ చేశారు. అయితే, నేటికీ రైతుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము జమకాకపోవడంతో.. ఆ డబ్బుల కోసం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు భూముల డబ్బులు చెల్లించకుండానే వారి పేర్లను రికార్డుల్లో తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనుల్లో మళ్లీ కదలిక రావడంతో.. తమ భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..?

బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం రెవెన్యూ పరిధిలో చింతలపూడి మెయిన్‌ కెనాల్‌ నుంచి సబ్‌ కెనాల్‌ పనుల కోసం అధికారులు భూసేకరణ చేపట్టారు. మెయిన్‌ కెనాల్‌ నుంచి శివారు భూమి వరకూ సుమారు 7 కిలోమీటర్ల పొడవునా రెడ్డిగణపవరం, వాడపల్లి కాలనీ, పట్టినపాలెం, పుల్లేపూడి, జైనవారిగూడెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 200 మంది సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు సేకరించారు. 2016 నుంచి 2018 వరకు ఈ ప్రక్రియ కొనసాగగా.. 2018లోనే ఈ భూములకు సంబంధించిన అవార్డు ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే, అప్పటి నుంచి కేవలం ఇద్దరు రైతులకు మాత్రమే పరిహారం చెల్లించి, మిగిలిన వారికి నేటికీ ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ చేయలేదని రైతులు వాపోతున్నారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూముల సేకరణ

8 ఏళ్లుగా పరిహారం చెల్లించని వైనం

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న 200 మంది రైతులు

సొమ్ములు చెల్లించకుండానే భూమి రికార్డుల్లో రైతుల పేర్లు తొలగింపు

మండిపడుతున్న రైతులు

‘తాము 2018లో భూములిచ్చిన సమయంలో అధికారులు ఎటువంటి పరిహారం చెల్లించకుండా ఏళ్ల తరబడి తిప్పించుకున్నారు. ప్రస్తుతం ఆ భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ధరలు పెంచి ఇస్తేనే భూములు ఇస్తాం. దాదాపు దశాబ్ద కాలంగా పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగి ఎంతో నష్టపోయాం. 200 మంది రైతులు భూములిస్తే అందులో కేవలం ఇద్దరికే సొమ్ములు చెల్లించి, మిగిలిన వారికి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పెంచిన ధరల ప్రకారం నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement