ద్వారకాతిరుమల: జూదానికి అలవాటుపడిన ఓ యువకుడు ఆర్థిక అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌న్‌లో గురువారం భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని తిరుమలంపాలెం గ్రామానికి చెందిన మిడతా లక్ష్మణరావు ఇంట్లో ఈ ఏడాది మార్చి 15న మధ్యాహ్నం దొంగలు పడి, బీరువాలోని వెండి వస్తువులతో పాటు రూ. 70 వేల నగదును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో చోరీకి పాల్పడింది అదే గ్రామానికి చెందిన చెల్లింకల శ్రీధర్‌గా గుర్తించి అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 244 గ్రాముల బరువున్న వెండి పట్టీలు, వెండి గ్లాసు, పూజకు ఉపయోగించే వెండి కుందులు, వెండి కుంకుమ భరణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్న వయస్సులోనే జూదానికి అలవాటుపడిన శ్రీధర్ ఆర్థిక అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైందని ఎస్సై సుధీర్ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ప్రసాదరావు, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో, సీఐ పి.కృష్ణ పర్యవేక్షణలో ఎస్సై, సిబ్బంది కేసు దర్యాప్తు నిర్వహించారు.


