వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
నరసాపురం: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో నిరసన పోరు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి రెండేళ్ల పాలనతో రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన జూన్ 4వ తేదీని బాబు రాక్షస పాలనపై పోరు పేరుతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆ రోజు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. రెండేళ్లుగా సంక్షేమ పథకాలు సవ్యంగా అందక కుదేలైన పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా పోరాడాలని చెప్పారు. ముఖ్యంగా నిరసన కార్యక్రమాల్లో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ స్వర్ణయుగం పాలన నడిచిందని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని గద్దెనెక్కిన ఏడాదిలోపే అమలు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, అగ్నికుల క్షత్రియ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తిరుమాని నాగరాజు, జిల్లా మత్స్యకార సొసైటీ సంఘం మాజీ అధ్యక్షుడు అండ్రాజు చల్లారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కామన బుజ్జి, నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షుడు చినిమిల్లి చందు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పప్పుల రామారావు, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ కావలి నాని తదితరులు పాల్గొన్నారు.


