మూల్యాంకనం.. ప్రశ్నార్థకం! | - | Sakshi
Sakshi News home page

మూల్యాంకనం.. ప్రశ్నార్థకం!

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

స్పెషల్‌ అసిస్టెంట్లతో వెట్టి చాకిరీ సమస్యలను పరిష్కరించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబధించి విద్యార్థులు రాసిన జవాబుపత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయులకు సవాలు విసురుతోంది. ముఖ్యంగా ట్యాబ్‌ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ ఉపాధ్యాయులకు పెను సవాలు విసురుతోంది. స్పెషల్‌ అసిస్టెంట్లకు ఈ విధానం తలకుమించిన భారంగా మారింది. ప్రతి స్పెషల్‌ అసిస్టెంట్‌ రోజుకు 80 జవాబు పత్రాలకు సంబంధించి ట్యాబ్‌ల్లో మార్కులు అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. దీంతో సాంకేతికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో పేపర్‌ స్కానింగ్‌ చేయడానికే వారికి 15 నుంచి 20 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఈ లెక్కన వారు ప్రతిరోజూ సుమారు 640 నిమిషాలకు పైగా సమయం ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎక్కువ మంది స్పెషల్‌ అసిస్టెంట్లు ఒకేసారి నెట్‌వర్క్‌ వినియోగిస్తుండడంతో ట్యాబ్‌లు సైతం మొరాయిస్తున్నాయి.

తరగని పని : సాధారణంగా జవాబుపత్రాల మూల్యాంకనం ఉదయం 9 నుంచి ప్రాంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాబ్‌ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ కారణంగా రాత్రి 9 గంటలు దాటిన తరువాత కూడా జరుగుతూనే ఉంటోంది. నెట్‌వర్క్‌ సమస్య ఒక కారణం కాగా విద్యార్థి రాసిన జవాబుపత్రంలోని ప్రతి పేజీని స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి రావడం, అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ దిద్దిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడం ప్రధాన సమస్యగా తలెత్తింది. మార్కుల విషయంలో ఎటువంటి తేడా వచ్చినా పూర్తి బాధ్యతను స్పెషల్‌ అసిస్టెంట్‌లదేనని చెప్పడంతో వారిలో తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది.

వేతనం పెంచాలని డిమాండ్‌ : జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లకు ఇస్తున్న వేతనం ఏమాత్రం న్యాయసమ్మతం కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు గంటలకు పైగా అదనపు సమయం పని చేస్తున్నందున వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లకు పేపర్‌కు రూ. 10 చొప్పున చెల్లించడంతో పాటు రోజుకు రూ.400 డీఏగా చెల్లించనున్నారు. వారికి మొత్తం రోజుకు రూ. 800 చెల్లించే అవకాశం ఉంది. అయితే వారితో పాటు సమానంగా పని చేస్తున్న స్పెషల్‌ అసిస్టెంట్లకు మాత్రం 80 పేపర్లు వెరిఫికేషన్‌ చేసినందుకు గాను కేవలం రోజుకు రూ. 300 మాత్రమే చెల్లించే ఏర్పాటు చేయడం దారుణమంటున్నారు.

మూల్యాంకన ప్రక్రియలో స్పెషల్‌ అసిస్టెంట్లు తీవ్ర అన్యాయానికి గురౌతున్నారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు దిద్దిన 80 పేపర్లను వీరు పరిశీలించి ట్యాబ్‌ల ద్వారా స్కానింగ్‌ చేసి మార్కులను నమోదు చేయించడం వెట్టి చాకిరీ చేయించడమే. పైగా వారికి రోజుకు కేవలం రూ. 300 వేతనం ఇస్తామనడం శ్రమదోపిడీగా పరిగణించాల్సి ఉంటుంది.

– గుగ్గులోతు కృష్ణ,

ఏపీటీఎఫ్‌ 1938, రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ట్యాబ్‌ల పనితీరు సక్రమంగా ఉండేలా చూడాలి. వేగవంతమైన నెట్‌వర్క్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. మూల్యాంకన విధుల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ నిత్యం ద్రవపదార్థాలు పంపిణీ చేయాలి. దీనితో పాటు గదుల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

– గెడ్డం సుధీర్‌, వైఎస్‌ఆర్‌ టీచర్స్‌

అసోసియేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

సవాలు విసురుతున్న జవాబుపత్రాల మూల్యాంకనం

నెట్‌వర్క్‌ లేక మొరాయిస్తున్న ట్యాబ్‌లు

స్పెషల్‌ అసిస్టెంట్లకు పని భారం

ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ చేసినా తరగని పని

వేతనం పెంచాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement