ఉపాధ్యాయుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల నిరసన

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

ఉపాధ్యాయుల నిరసన జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం అర్లగట్టును పరిశీలించిన రెవెన్యూ అధికారులు

భీమవరం (ప్రకాశంచౌక్‌): కూటమి ప్రభుత్వం ఏర్పాటై 31 నెలలు గడుస్తున్నా 12వ పీఆర్సీ కమిటీని నియమించకపోవడం విచారకరమని ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌.సాయిశ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలోని స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం వద్ద గురువారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి, సాయిశ్రీనివాస్‌ ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలో నిరాహార దీక్షలు నిర్వహిస్తామని సాయిశ్రీనివాస్‌ తెలిపారు. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలోని అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్‌ హెల్త్‌ చెకప్‌ కార్యక్రమం నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ఈ కార్యక్రమం భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు జర్నలిస్టులకు ఈనెల 10వ తేదీ ఉదయం భీమవరం జిల్లా కలెక్టర్‌ ప్రాంగణంలో భీమవరం లయన్స్‌ క్లబ్‌, ఫెమినా లయన్స్‌ క్లబ్‌, ఒమిక్స్‌ నెక్ట్స్‌ లేబోరేటరీస్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఈ ఆరోగ్య శిబిరాలు ఈనెల 13న నిర్వహిస్తామన్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): రబీ సీజన్‌ ప్రారంభాన్ని దృష్టిలో ఉంచు కొని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం గూగుల్‌ మీట్‌ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాకు 7.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం రవాణా కోసం 1000 వాహనాలను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 438 వాహనాలకే రిజిస్ట్రేషన్‌ పూర్తయిందన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చూడాలని సూచించారు. అనంతరం గ్యాస్‌ సరఫరా వ్యవస్థపై పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్‌ కొరత లేకుండా చర్యలు తీసుకో వాలని, వినియోగదారులు బుకింగ్‌ చేసిన తేదీ ఆధారంగా సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డొమెస్టిక్‌ గ్యాస్‌ను అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి సరిహద్దులో ఉన్న అర్లగట్టును గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్‌ తవ్వకాలు పెచ్చు మీరుతుండడంతో ‘కొండలనూ తవ్వేస్తున్నారు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై తహసీల్దార్‌ పీఎన్వీ ప్రసాద్‌ ఆదేశాలతో ఆర్‌ఐ యూనస్‌, వీఆర్వో సుబ్బయ్య గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అర్లగట్టుపై గ్రావెల్‌ తవ్వకాలను పరిశీలించి కలెక్టర్‌కు నివేదికను పంపిస్తామని తహసీల్దార్‌ ప్రసాద్‌ తెలిపారు. అనుమతులు లేకుండా గ్రావెల్‌, మట్టి అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement