పెంటపాడు: దాళ్వా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు సరైన అవగాహన అవసరమని జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సీజన్ ప్రారంభం దృష్ట్యా బుధ వారం పెంటపాడు మండలం ముదునూరులో ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గోనె సంచుల కొరత రానివ్వకుండా రైతులు సకాలంలో సంచులు తీసుకెళ్లాలన్నారు. మిల్లులకు ధాన్యం అమ్మిన సందర్భంలో ఓటీపీ నెంబర్ తప్పనిసరిగా సరి చూసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖాఽధికారి జెడ్.వెంకటేశ్వర్లు, ఏడీఏ ఆర్.గంగాధరరావు, మండల వ్యవసాయాధికారి చిర్ల రవికుమార్ తదితరులు రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత జనవరి 21 నుంచి 29 వరకూ తొలి విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడత పరీక్షలు ఏలూరు జిల్లాలో ఒక కేంద్రంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించిన ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలోని డీఎన్‌ఆర్ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు.
కై కలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2025–26 సంవత్సరానికి దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులకు సంబంధించి గ్రూప్–4 పోస్టులు 17, క్లాస్–4 పోస్టులు 12 భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల సంక్షేను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్‌కుమార్ బుధవారం చెప్పారు. విద్యార్హత, కేటగిరిలలో ఖాళీల వివరాలు, నమూనా దరఖాస్తుతో కూడిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చారన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08812–234146 నెంబరులో సంప్రదించాలని కోరారు.
భీమవరం(ప్రకాశంచౌక్): కాళీపట్నం–భీమవరం ప్రధాన రహదారిపై అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో, ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం నుంచి కాళీపట్నం వైపు వెళ్లే వాహనాలు భీమవరం, దిరుసుమర్రు జంక్షన్ అంతర్గత గ్రామ రహదారి మీదుగా కాళీపట్నం, కాళీపట్నం నుంచి భీమవరం వైపు వచ్చే వాహనాలు కాళీపట్నం, రామాయణపురం గ్రామ అంతర్గత రహదారి మీదుగా భీమవరం రావాలని సూచించారు. భారీ వాహనాలు సమీప ప్రధాన రహదారులు, జిల్లా రహదారుల మీదుగా మళ్లిస్తారన్నారు.
జంగారెడ్డిగూడెం: వర్జీనియా వేలం ప్రక్రియ ధరల్లో మార్పు లేకపోవడంతో రైతులు ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. వేలం ప్రక్రియలో బయ్యర్లు, సిబ్బంది కొరతతో షిప్ట్ పద్దతిలో వేలం నిర్వహిస్తుండగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 5 వేలం కేంద్రాల పరిధిలో బుధవారం జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో మొత్తం 182 బేళ్లు రాగా, వాటిలో 113 బేళ్లు తిరస్కరించారు. 69 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ. 265, కనిష్ట ధర రూ.250 వచ్చింది. సరాసరి రూ.256.86గా నమోదైంది. జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 232 బేళ్లు అమ్మకానికి రాగా, 130 బేళ్లు తిరస్కరించారు. 102 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.255 వచ్చింది. సరాసరి ధర రూ.258.26 నమోదైంది.


