శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.02 కోట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.02 కోట్లు

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.02 కోట్లు చింతలపూడి విద్యార్థిని అద్భుత ప్రతిభ ‘పది’ పరీక్షలకు 22,751 మంది హాజరు ఆకివీడు ఘటనపై సమగ్ర విచారణ జరపాలి పామాయిల్‌ గెలలు నరుకుతూ..

ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు సోమవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, అన్నవరం దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌, ఏఈఓ ఎం.మంజులాదేవి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,02,77,293 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 195 గ్రాముల బంగారం, 2.124 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ. 5 వేలు లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,13,865 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.

చింతలపూడి: తిరుపతిలో సోమవారం ఘనంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో చింతలపూడికి చెందిన విద్యార్థిని కారుమంచి రిషిత అద్భుత ప్రతిభ కనబరిచింది. తన విద్యా ప్రతిభతో ఏకంగా 9 బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా రిషిత ఈ పతకాలను అందుకుంది. చింతలపూడికి చెందిన ఉపాధ్యాయులు కారుమంచి ప్రకాష్‌ మాస్టారు కుమార్తె అయిన రిషిత, గన్నవరం వెటర్నరీ కళాశాలలో చదువుతోంది. స్నాతకోత్సవం అనంతరం రిషితను కళాశాల అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్ర పరీక్షకు 22751 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 23249 మంది విద్యార్థులకు గాను 498 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 97.86 శాతంగా నమోదైంది. ఈ పరీక్షలో ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు.

ముగిసిన దూర విద్య 10 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సోమవారం నిర్వహించిన గణితం పరీక్షకు 575 మంది విద్యార్థులు హాజరయ్యారు. 115 మంది గైర్హాజరయ్యారు. అలాగే భారతీయ సంస్కృతి, వారతస్వం పరీక్షకు ముగ్గురు విద్యార్థులకుగాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు.

ఏలూరు (టూటౌన్‌): ఆకివీడు ఘటనపై సమగ్ర పరిశీలన చేసేందుకు సిట్టింగ్‌ జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జితో న్యాయ విచారణ జరపాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జాతీయ దళిత జేఏసీ చైర్మన్‌ పెరికె వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సంఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు సోమవారం వినతి పత్రం అందజేసారు. దీనికి సంబంధించిన వివరాలను ఏలూరులో పత్రికలకు విడుదల చేశారు. మత ఘర్షణలకు కారణమై దళితులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయిస్తున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ సభ్యత్వం రద్దు చేసి ఉభా సభాపతి నుంచి తొలగించాలని కోరారు.

టి.నరసాపురం: పామాయిల్‌ గెలలు నరుకుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన చెన్ని శివాజీ (23) పామాయిల్‌ గెలలు నరికే పనికి వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగానే మరో ఇద్దరు కూలీలతో కలసి మండలంలోని గుడ్లపల్లికి చెందిన రైతు పామాయిల్‌ తోటలో గెలులు నరకడానికి వెళ్లాడు. పామాయిల్‌ గెలలు నరుకుతుండగా గెడ కత్తి విద్యుత్‌ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో తోటి కూలీలు 108కి ఫోన్‌ చేయగా సిబ్బంది వచ్చి అతడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement