బస్సుషెల్టర్లు లేక అవస్థలు | - | Sakshi
Sakshi News home page

బస్సుషెల్టర్లు లేక అవస్థలు

Mar 29 2026 6:47 AM | Updated on Mar 29 2026 6:47 AM

అధికారులు స్పందించాలి

తాడేపల్లిగూడెం(టీఓసీ): ఆర్టీసీ బస్సులు ఆగేందుకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సరైన బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెం బస్సు కాంప్లెక్స్‌ నుంచి ఏలూరు, భీమవరం, తణుకు, నల్లజర్ల వైపు వెళ్లే ప్రధాన మార్గాలు ఉన్నాయి. బస్సు కాంప్లెక్స్‌ నుంచి బయలుదేరిన తర్వాత తాలూకా ఆఫీస్‌ సెంటర్‌, శేషమహల్‌ రోడ్డు ప్రారంభంలోని ఎన్టీఆర్‌ జంక్షన్‌, ఫ్లై ఓవర్‌ మీదుగా తణుకు వెళ్లే స్టాప్‌, భీమవరం వెళ్లే స్టాప్‌, ఏలూరు వైపు వెళ్లే స్టాప్‌ల వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నల్లజర్ల వైపు గొల్లగూడెం సెంటర్‌, హౌసింగ్‌బోర్డు సెంటర్‌, మాగంటి కళ్యాణ మండపం సెంటర్లు కూడా రద్దీగా ఉంటాయి.

తణుకు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం షెల్టర్‌ నిర్మించినప్పటికీ, మిగిలిన చోట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. హౌసింగ్‌బోర్డు సెంటర్‌ వద్ద దాతలు నిర్మించిన బస్సు షెల్టర్‌ ఉన్నా, అది బస్సులు ఆగే ప్రాంతానికి దూరంగా, ఒక మూలకు ఉండటంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. నేడు ఆ బస్సు షెల్టర్‌ను ఎవరూ ఉపయోగించడం లేదు.

షెల్టర్లు లేక ప్రయాణికుల ఇబ్బందులు

పట్టణంలోని ప్రధాన సెంటర్లయిన తాలూకా ఆఫీస్‌ సెంటర్‌, ఎన్టీఆర్‌ జంక్షన్‌, భీమవరం వైపు వెళ్లే ప్రభాత్‌ టాకీస్‌ సెంటర్‌, ఏలూరు వైపు వెళ్లే మోడ్రన్‌ కేఫ్‌ సెంటర్‌ల వద్ద బస్సులు నిలిపేందుకు షెల్టర్లు లేవు. దీంతో ఎండలు, వానలకు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగితే, షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. వర్షం పడినప్పుడు సమీపంలోని దుకాణాల వద్ద తలదాచుకోవాల్సి వస్తోంది. మరోవైపు, షెల్టర్లు లేకపోవడంతో బస్సుల కోసం రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు. సమీప షాపులు వద్ద నిలబడటం, లేదంటే రోడ్డుపైనే ఉంటున్నారు. ప్రయాణికులను ఎక్కించేందుకు బస్సు రోడ్డుపైన ఆపినప్పుడు బస్సు వెనుక నున్న వాహనాలు వారు ముందుకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా ఏలూరు, భీమవరం మార్గాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. తాలూకా ఆఫీస్‌ సెంటర్‌, ఎన్టీఆర్‌ జంక్షన్‌, భీమవరం వైపు, ఏలూరు వైపు తక్షణమే షెల్టర్లు నిర్మించి, బస్సులు రోడ్డు పక్కన ఆగేలా ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్‌ సమస్య కూడా తగ్గుతుందంటున్నారు.

తాడేపల్లిగూడెంలో ప్రయాణికుల ఇక్కట్లు

రానున్నది వేసవి కాలం అందువల్ల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో బస్సు షెల్టర్లు నిర్మించాలి. ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డు మీద పడిగాపులు పడకుండా చూడాలి. బస్సులు వచ్చే వరకు కూర్చునేందుకు, సేద తీరేందుకు అవకాశం ఉండాలి. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి.

– తాడేపల్లి శ్యాంబాబు, మాలల జేఏసీ టౌన్‌ యువజన అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement