మట్టిరహిత నారు మొక్కలు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

మట్టిరహిత నారు మొక్కలు అందిస్తాం

Mar 29 2026 6:47 AM | Updated on Mar 29 2026 6:47 AM

మట్టిరహిత నారు మొక్కలు అందిస్తాం ఏప్రిల్‌ 8న కిసాన్‌ మేళా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెం: మట్టిరహిత పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన కూరగాయల నారును రైతులకు అందించడమే లక్ష్యంగా ఉద్యాన విశ్వవిద్యాలయంలో మొక్కలను తయారు చేస్తున్నామని వీసీ డాక్టర్‌ కె.ధనుంజయరావు తెలిపారు. శనివారం విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో నామమాత్రపు ధరకే రైతులకు మొక్కలను అందజేశారు. ఈ పద్ధతిలో పెంచిన నారుకు తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుందని, నారు దశలోనే వ్యాధులను నివారిస్తామని పేర్కొన్నారు. మొక్కలు కావాల్సిన రైతులు వీఆర్‌ గూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. వర్సిటీలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు జి.రామానందం, హెడ్‌ టి.సుశీల, శాస్త్రవేత్త ఎన్‌.వి.గౌతమ్‌ పాల్గొన్నారు. అంటుగట్టిన నారు కోసం 73826 33654 నెంబరులో సంప్రదించవచ్చన్నారు.

పెనుగొండ: ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏప్రిల్‌ 8న కిసాన్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గోదావరి మండలం పరిశోధన సహ సంచాలకుడు డాక్టర్‌ టి.శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం విలేకర్లతో మాట్లాడుతూ మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం అంశంపై మేళా జరుగుతుందన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మేళా జరుగుతుందని వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారన్నారు. 8వ తేదీన ఉదయం రైతుల నమోదుతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం క్షేత్ర సందర్శన, వ్యవసాయ ప్రదర్శన, రైతులతో శాస్త్రవేత్త చర్చా గోష్టి, వ్యవసాయ క్విజ్‌, రైతు సదస్సు, వ్యవసాయ ప్రచురణల విడుదల, రైతులతో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.

ఆకివీడు: మండలంలోని కుప్పనపూడిలోని తాళ్లకోడు రోడ్డులో శనివారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల రాంబాబును 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఏలూరు మాధవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement