భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మత్స్యశాఖాధికారిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ విజయవాడ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ప్లానింగ్ సెక్షన్‌లో డిప్యూటీ డైరక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ అప్సడ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, ఆక్వా రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిస్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఆకివీడు: స్థానిక పెదపేటలోని గొంతేనమ్మ గుడిని రామాలయంగా మార్చే ప్రయత్నానికి ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది. నిజనిర్ధారణ కమిటీ ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించి వివరాలు సేకరించినట్లు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, కార్యదర్శి జీ.రోహిత్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గొంతేనమ్మ సత్రం పడగొట్టి రామాలయం నిర్మిస్తామనడంపై స్థానిక దళితులు అభ్యంతరం తెలిపారన్నారు. ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం, దళితులపై దాడి చేసిన వారిపై ఇంతవరకూ కేసులు నమోదు చేయకపోవడం చూస్తే స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని వారు పేర్కొన్నారు. పోలీసుల మొహరింపు స్థానిక దళితుల్ని భయపెట్టడానికేనన్నారు. దళితులపై దాడిచేసిన వారిపైన, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపైన కేసులు నమోదు చేయాలని, దాడికి సంబంధం లేనివారిపై వెంటనే వ్యక్తిగత పూచిపై విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, బాధితులకు పోలీసు శాఖ భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు పునరావృతం కాకుండా లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 15 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం రూరల్: మండలంలోని లక్ష్మణేశ్వరం పరిధి గొల్లలవంతెన సమీపంలో సోమవారం పాత కక్షలతో స్కూటర్‌కు నిప్పు పెట్టారు. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన దేశంశెట్టి వెంకటకృష్ణ ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కోలపర్తి పవన్ గొల్లల వంతెన సమీపంలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్న సమయంతో ఇద్దరికీ వివాదం మొదలైంది. గతంలో గొడవల నేపథ్యంలో పవన్, వెంకట రమణల మద్య మాటామాటా పెరిగింది. వెంకటరమణ తన వద్ద ఉన్న పెట్రోలను పవన్ స్కూటర్‌పై పోసి నిప్పు అంటించాడు. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో గాయపడ్డ వెంకటకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


