పాలకొల్లు సెంట్రల్: పెంకుళ్లపాడు ఎల్‌అండ్‌టీ గృహాల సముదాయంలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం ఇంటి తాళాలు అందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నేడు 2016 మంది నూతన గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన 1500 ఇళ్లను జులై నాటికి పూర్తి చేసి అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ ఇంటి తాళాలు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల వారికే ఇళ్లు మంజూరు చేసినట్లు సమాచారం. టిడ్కోలోకి ఒకే గేటు ఉండడంతో జనం ఎండలో మాడిపోయారు. తాగడానికి నీళ్లు లేవని వాపోయారు. ఇంకా ఇళ్లు పూర్తికాకముందే ఈ హడావుడి ఎందుకని లబ్ధిదారులు నిలదీశారు.
భీమవరంలో..
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 1920 టిడ్కో గృహాలకు సోమవారం సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 1,920 టిడ్కో గృహాల సామూహిక గృహప్రవేశాలు సంతోషకరమని పేర్కొన్నారు. మిగతా లబ్ధిదారులకు జూన్–జూలై నెలలలోపు గృహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


