కై కలూరు : గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై రెవెన్యూ అధికారులు శనివారం కై కలూరులో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల పీడీఎస్ డీటీ కె.వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు చేసి మొత్తం 21 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనంతరం తహసీల్దారు ఆర్.రామకృష్ణ మాట్లాడుతూ.. పట్టుబడిన వారికి 6ఏ నోటీసులు అందజేస్తామని, సీజ్ చేసిన సిలిండర్లను ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాడేపల్లిగూడెం : వ్యాపారంలో నైతిక విలువలు ఎంతో అవసరమని వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటకృష్ణ అన్నారు. ఏపీ నిట్‌లో శనివారం నిర్వహించిన ‘స్టార్టప్ లీగల్ ఎథికల్ స్టెప్స్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల, అంకితభావంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే నేర్పు ఉండాలన్నారు. సరైన వ్యాపారాన్ని ఎంచుకోవడం, కంపెనీ రిజిస్ట్రేషన్ విధానాలు, మేధోసంపత్తి హక్కుల ప్రాధాన్యత గురించి వివరించారు. వ్యాపారంలో పారదర్శకత, నమ్మకం, నైతిక విలువలు ఉండాలని, ప్రభుత్వ పథకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తికేయశర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీన్‌లు రవికిరణ్ శాస్త్రి, జి.బి.వీరేష్‌కుమార్, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: మండలంలోని ఇప్పలపాడు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ మిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతిలో బాలురు–1, బాలికలు–4, 9వ తరగతిలో బాలురు–1, 11వ తరగతిలో బాలురు–15, బాలికలకు 15 సీట్లు ఖాళీగా ఉన్నా యని వివరించారు. అర్హత గల విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు పాఠశాలకు నేరుగా వచ్చి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే సీట్లు కేటాయిస్తామన్నారు. వివరాలకు 9412102600 నెంబరులో సంప్రదించవచ్చన్నారు.
చాట్రాయి: విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని చనుబండలో జరిగింది. గ్రామానికి చెందిన చిన్నం లక్ష్మీ నారాయణ (45) శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లి ఫీజు వేస్తుండగా షాక్ తగిలి అక్కడి అక్కడే మృతి చెందాడు. రాత్రి రెండు గంటల వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడు తనకున్న భూమితో పాటు కొంత కౌలుకు తీసుకుని నిత్యం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు కొడుకులను చదివించుకుంటన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.రామకృష్ణ తెలిపారు.


