● నిర్మానుష్యంగా రహదారులు
● చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు
తణుకు అర్బన్: ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీనికి తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం అధిక వేడి కారణంగా, ఉక్కపోతతో తణుకు పట్టణంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే తణుకులోని ప్రధాన రహదారులైన రాష్ట్రపతి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, వంగవీటి మోహన రంగా వీధి, రైల్వే స్టేషన్‌రోడ్డు, వేల్పూరు రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు ప్రాంతాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనం సంచారం తగ్గింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రయాణికులు ఎండతో ఇబ్బంది పడగా, చిరు వ్యాపారులు లేక డీలా పడ్డారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
వేసవి ఎండల తీవ్రత కారణంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉక్కపోత వాతావరణానికి దాహంతో ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన రహదారుల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేస్తే ప్రయాణికులు దాహార్తిని తీర్చుకుంటారని పలువురు కోరుతున్నారు.


