తణుకు అర్బన్: చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు వాయిస్ మెసేజ్ పంపి అదృశ్యమైన యువకుడి కేసును తణుకు పోలీసులు ఛేదించారు. తణుకు పట్టణానికి చెందిన చిట్టూరి భీమరాజు ఈనెల 26 రాత్రి నుంచి అదృశ్యం కాగా శుక్రవారం రాత్రి తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా యువకుడి సెల్‌ఫోన్ ఆధారంగా గంట వ్యవధిలోనే వివరాలు తెలుసుకుని తణుకు మండలం తేతలి వైజంక్షన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లితండ్రులకు అప్పగించారు. భీమరావు తన ప్రేమ వ్యవహారంలో భాగంగా ఇటు కుటుంబసభ్యులను పోలీసులను సైతం పక్కదారి పట్టించే విధంగా ఆంధ్రా సుగర్స్ ప్రాంతంలోని కాలువ వంతెన సమీపంలో తన బైక్, చెప్పులు వదిలి అదృశ్యమైనట్లుగా నమ్మించాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో కాలువలోకి దూకేశాడేమోనని భావించిన తల్లితండ్రులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు యువకుడి ఆచూకీ కనుగొన్నారు. యువకుడిని తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లితండ్రులకు అప్పగించారు.


