నర్సాపురం రూరల్ : స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్ ‘విజన్–ఎక్స్ 2026’ సాంకేతిక పోటీల్లో విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 64 టీంలు, ఇతర రాష్ట్రాల నుంచి 12 టీంలు పాల్గొనగా, ఆతిథ్య స్వర్ణాంధ్ర కళాశాల నుంచి 37 టీంలు పోటీపడ్డాయి. ముంగిపు కార్యక్రమానికి ఎన్‌సీసీ కాకినాడ గ్రూప్‌కు చెందిన గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల విద్యార్థులు మొదటి బహుమతిని, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్పర్‌మేషన్ టెక్నాలజీ ద్వితీయ బహుమతి, ఎన్‌ఐటిఏపీ తృతీయ బహుమతిని సాధించగా బెస్ట్ ఉమెన్ టీంగా స్వర్ణాంధ్ర, బెస్ట్ ఇన్నోవేషన్ టీంగా లక్కిరెడ్డి బాల్‌రెడ్డి కళాశాల విద్యార్థులు బహుమతులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ అతిథులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సుమారు 30కి పైగా తినుబండారాల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల చైర్మన్ కొండవీటి వెంకట నారాయణ, కళాశాల కోశాధికారి కొండవీటి వెంకటేశ్వరస్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, డైరెక్టర్ ఎస్ కీర్తికుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సురేష్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ గోపిచంద్, ఇతర యాజమాన్య ప్రతినిధులు విద్యార్థులను అభినందించారు.


