మామిడి రైతు కుదేలు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతు కుదేలు

Mar 24 2026 6:48 AM | Updated on Mar 24 2026 6:48 AM

కాయ సైజు పెరగలేదు

చింతలపూడి: ఆరంభంలో ఆశలు రేపిన మామిడి తోటలు, తీరా కోత సమయానికి రైతులకు కన్నీరు మిగులుస్తున్నాయి. ఆశించిన స్థాయిలో పూత వచ్చినా.. తెగుళ్ల దాడి, అకాల వర్షాలు, మార్కెట్‌ ధరల పతనం వెరసి ఈ ఏడాది మామిడి సాగు గడ్డుకాలంగా మారుతోంది. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలపాలవుతుందోనని అన్నదాతలు గుబులు చెందుతున్నారు.

తేనె మంచు దెబ్బ

ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో తోటలు ఆశాజనకంగా పూత పూశాయి. అనూహ్యంగా తేనె మంచు తెగులు వల్ల పూత మాడిపోయి రాలిపోయింది. దీంతో కాయ సైజు తగ్గి, దిగుబడిపై ప్రభావం పడింది. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో తోటలు ఆలస్యంగా పూతకు రావడంతో, ప్రస్తుతం కాయలు ఇంకా తగిన సైజుకు చేరుకోలేదు.

ధరల పతనం

మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగినపల్లి రకం ప్రస్తుతం టన్ను రూ.70,000 నుంచి రూ. 80,000 వరకు ధర పలుకుతోంది. తోతాపురి రకం సీజన్‌ ఆరంభంలో టన్ను రూ.లక్ష వరకు పలికిన ధర, వాతావరణ పరిస్థితుల వల్ల నాణ్యత తగ్గడంతో ఒక్కసారిగా రూ.25,000కు పడిపోయింది. ఇది రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తోంది.

అకాల వర్షాల భయం

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను కలవరపెడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు సబ్‌ డివిజన్‌లో సుమారు 40,000 ఎకరాలు, చింతలపూడి సబ్‌ డివిజన్‌లోని చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో మామిడి సాగు విస్తరించి ఉంది. గాలి వానకు కాయలు రాలిపోతే పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వెలవెలబోతున్న కమిషన్‌ దుకాణాలు

సాధారణంగా ఈ పాటికి చింతలపూడి వంటి ప్రాంతాల్లో కమిషన్‌ దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాలి. కాయలు ఇంకా పూర్తిస్థాయిలో తయారు కాకపోవడంతో వ్యాపారులు దుకాణాలు తెరవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం లభ్యమవుతున్న కొద్దిపాటి దిగుబడిని వ్యాపారులు నేరుగా గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏలూరు జిల్లా మామిడికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఏటా ఢిల్లీ, కోల్‌కతా, నాగపూర్‌, పుణె, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు, మన రాష్ట్రంలో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తెనాలి వంటి ప్రధాన వ్యాపార కేంద్రాలకు కాయలు ఎగుమతి చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, మార్కెట్‌ మాయాజాలం మరోవైపు మామిడి రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఉద్యానవన సాగుదారులు కోరుతున్నారు.

తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం

మార్కెట్‌లో ధర ఉన్నా తోటల్లో కాయ సైజు పెరగలేదు. తేనె మంచు పురుగు వల్ల మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి హైదరాబాద్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ మార్కెట్‌కు కాయలు తరలిస్తున్నాం. మామిడి రైతుల సౌకర్యార్థం మెట్టప్రాంతంలో మామిడి కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది.

– సిహెచ్‌. సుధాకర్‌, శ్రీనివాస ఫ్రూట్‌ కంపెనీ, చింతలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement