నూజివీడు: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ మహమద్ ఫారూఖ్ సోమవారం తెలిపారు. ఎంప్లాయిస్ కాలనీలోని పాఠశాల తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1 నుంచి 5వ తరగతి వరకు తరగతులు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతాయని, ప్రతి తరగతికి 40 సీట్లు ఉంటాయని చెప్పారు. ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలన్నారు. కేంద్రీయ విద్యాలయం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2 నుంచి 5వ తరగతి వరకు చేరాలనుకునే వారు దరఖాస్తులను నేరుగా కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రథమ ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.


