భీమవరం (ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్ అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా, సీనరేజీ చెల్లించకుండా మట్టి అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మట్టిని తరలించే లారీలు, ట్రాక్టర్లను తనిఖీ చేయాలన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రామ, వా ర్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డీపీఓ ఎం.రామనాథరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● ఇరగవరం మండలం గుబ్బలవారిపాలెంలో శ్శశాన వాటికకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, రోడ్డు సమస్య పరిష్కరించాలని గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్‌ను కోరారు. పైప్‌లైన్ ద్వారా మంచినీరు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు.
● ఆకివీడుకు చెందిన పి.సత్యనారాయణ తనకు 66 శాతం వైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
● మొగల్తూరు మండలం మోడీ, కొత్తకాల తిప్ప, పేరుపాలెం, ఏటిమొండి, మొలపర్రులో సు మారు 2 వేల ఎకరాలకు నీరందించే వీఆర్ చానల్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని బీజేపీ జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగారాజు వినతిపత్రం అందజేశారు.
● పాలకోడేరు మండలానికి చెందిన పేరిచర్ల పల్లంరాజు తనకు తన తల్లి నుంచి 65 సెంట్ల భూమి సంక్రమించిందని ఇప్పటివరకు రైతు భరోసా సొమ్ము పడలేదని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.


