అభివృద్ధి కోసం అంటూ అబద్ధాలు
పెద్దింట్లమ్మ భక్తులకు
పంగనామం
సాక్షి టాస్క్‌ఫోర్స్: కొల్లేరు ఇలవేల్పు పెద్దింట్లమ్మవారి పేరుతో భక్తులను నిలువు దోపిడీకి కొందరు సిద్ధమయ్యారు. అక్రమ వాహన పార్కింగ్ పాట నిర్వహించి అవినీతికి అడ్డే లేదని నిరూపిస్తున్నారు. వాహన పార్కింగ్ వసూలుతో ఇటు దేవస్థానం, అటు పంచాయతీ చెడ్డ పేరు వస్తుందని మొత్తుకుంటున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 11 నెలల కాలానికి రూ.7 లక్షల 7 వేలకు ధనరాజ్ అనే వ్యక్తి పార్కింగ్ పాటను శుక్రవారం దక్కించుకున్నాడు. దేవస్థానం అధికారులు స్థానిక రాజకీయం ముందు ఏమీ మాట్లాడలేక తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు.
అడ్డగోలు దోపిడీ
అమ్మవారి జాతర సమయంలో నెల రోజులు దేవస్థానం వద్ద పార్కింగ్ పాట పందిరిపల్లిగూడెం పంచాయతీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది రూ.2.60 లక్షలకు పాట వెళ్లింది. ఈ నిధులు పంచాయతీకి చెల్లించారు. గురువారంతో పంచాయతీ పాట ముగిసింది. జాతర సమయంలో కారుకు రూ.70, ఆటోకి రూ.50, ద్విచక్రవాహనానికి రూ.20 వసూలు చేశారు. మళ్లీ ఈ పాట ఏడాదిలో జాతర సమయంలో మాత్రమే జరుగుతోంది. అయితే 11 నెలలకు అక్రమ పార్కింగ్ పాటను ప్రైవేట్ వ్యక్తులు దే వస్థానం వద్దే నిర్వహించడం బరి తెగింపునకు నిదర్శనంగా మారింది.
తండ్రీ కొడుకుల ముందు తలవంచాల్సిందే !
దేవస్థానం మొత్తం అక్కడ తిష్టవేసుకున్న తండ్రీకొడుకుల ముందు తలవంచాల్సిన పరిస్థితి దాపురించింది. ఎన్ని తప్పులు చేసిన వెనకేసుకొచ్చే రాజకీయ నాయకుల అండతో వీరు రెచ్చిపోతున్నారు. అప్పుడప్పుడూ రాజకీయ నేతలను తీసుకొచ్చి సన్మానాలు చేయడంతో వీరు ఎంత బరి తెగించినా అధికారులు సైతం నోరు మెదపడం లేదు. అలాగే ఆలయంలో పెత్తనం సైతం వీరి చేతుల్లో ఉంటోంది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తమ మాట కాదనరని ప్రచారం చేయడం, నిత్యం ఆయన పక్కనే నీడలో ఉండటంతో కొల్లేరు పెద్దలు సైతం వీరు ముందు మాట్లాడడానికి జంకుతున్నారు.
అక్రమ పార్కింగ్ పాటను నిర్వహించిన ఘనులు పాట నిధులతో దేవస్థానం గదులకు మరుగుదొడ్లు కట్టిస్తామని నమ్మబలుకుతున్నారు. రూ.లక్షల్లో దాతలు విరాళాలు ఇస్తున్నప్పుడు పార్కింగ్ పాట ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. చట్టప్రకారం భక్తుల నుంచి పార్కింగ్ వసూలు చేయాలంటే దానికి టెండర్లు, రేట్లు నిర్ణయం ఇలా నిబంధనలు ఉంటాయి. ఇప్పటికే జాతర సమయంలో అధిక రేట్లు వసూలు చేస్తున్నారంటూ భక్తులు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ పార్కింగ్ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. పందిరిపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తమకు చెప్పకుండా పాట నిర్వహించారని వివరణ ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహన పార్కింగ్ పాట
11 నెలలకు రూ.7.07 లక్షలకు పాడుకున్న వైనం
సంబంధం లేదంటున్న ఈఓ, పంచాయతీ కార్యదర్శి
భక్తుల నుంచి అడ్డగోలు దోపిడీకి శ్రీకారం


