టిడ్కో ఇళ్లు.. సమస్యలు ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

టిడ్కో ఇళ్లు.. సమస్యలు ఫుల్‌

Mar 18 2026 7:33 AM | Updated on Mar 18 2026 7:33 AM

మంచినీటి సమస్యతో ఇబ్బందులు

టాయిలెట్స్‌ నిండిపోయాయి

వేధిస్తున్న మంచినీటి కొరత

చెత్త, డ్రెయినేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు

భీమవరం(ప్రకాశం చౌక్‌): పట్టణంలోని టిడ్కో ఇళ్ల సముదాయంలోని సమస్యలతో అక్కడ ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేక రోగం వస్తే స్థానికంగా వైద్యం అందే సౌకర్యం లేక ఏడారిలో మాదిరిగా వారు బతుకుతున్నారు. పైపులైను, వాటర్‌ ట్యాంకు ఉన్న మంచినీళ్లు సక్రమంగా సరఫరా లేక దాహంతో అలమట్టిస్తున్నారు. ఊరికి దూరంగా ఉండే వాళ్ల గురించి మాకు ఎందుకులే అన్నట్లు మున్సిపల్‌ అధికారులు పట్టించుకోంవడం లేదు. దాంతో ప్రాణాలు నిలుపుకొవడానికి బయట నుంచి మంచినీళ్లు తెచ్చుకుని దాచుకుని తాగే పరిస్థితి అక్కడ ఉంది.

అధ్వానంగా పారిశుద్ధ్యం

టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద గత ప్రభుత్వం రూ.15 కోట్లుతో ఎస్‌టీపీ ప్లాంట్‌ మంజూరు చేసింది. నిర్మాణం చేస్తున్న ఎస్‌టిపీ ప్లాంట్‌ సంవత్సరాల తరబడి నిర్మాణంలో ఉండడం అధికారులు వేగంగా నిర్మాణం పూర్తి చేయలేకపోవడంతో టిడ్కో లబ్ధిదారులకు శాపంగా మారింది. ప్లాట్లులోని టాయిలెట్స్‌లో వాడిన నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో టాయిలెట్స్‌ నిండిపోయి పైకి రావడంతో దుర్వాసనను ప్లాట్లులో ఉండేవారు భరించలేకపోతున్నారు. సరైన డ్రెయినేజీ వ్యవస్ధ లేకపోవడంతో రోడ్లు వెంబడి,ప్లాట్‌ వద్ద మురికి నీళ్లు నిల్వ ఉండి పారిశుద్ధ్యం అధ్వానంగా మారిపోయింది. దానికి తోడు సకాలంలో తొలగించని చెత్తచెదారంతో అక్కడ వారు నరకం చూస్తున్నారు.

వైద్య సేవలూ దూరం

టిడ్కోలో సుమారు 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి కనీస సౌకర్యాల్లో భాగంగా ఉండాల్సిన వైద్య సౌకర్యం లేదు. అక్కడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దాంతో రోగాలు వస్తే రెండు కీలోమీటర్లు దూరంలో ఉన్న భీమవరం పట్టణానికి రావాలసిన పరిస్థితి ఉంది. ఈ కుటుంబాల కోసం కనీసం సచివాలయం కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. ఏదైన పని ఉంటే మున్సిపాలిటికి వెళ్లాలసివస్తుంది.

వేధిస్తున్న సమస్యలు

టిడ్కో ఇళ్లుకు వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా మారింది. ఈ రోడ్డును గత ప్రభుత్వంలో నిర్మించారు. ఈ రోడ్డు కాలువ గట్టుపై ఉండడంతో క్రమేపి దెబ్బతిన్ని గోతుల మయంగా మారింది. కనీసం ఈ రోడ్డు నిర్మాణం కూడా చేయలేదు. దాంతో టిడ్కో లభ్ధిదారులు రాకోపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. టిడ్కో లోపల వీధిలైట్లు వెలగడం లేదు. దాంతో చీకటిల్లో వారు ఇబ్బందులు పడుతున్నారు. టిడ్కోలో నిర్మానుషంగా ఉండే ప్రాంతంలో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుండడంతో అక్కడ వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భయపడుతున్నారు. వాటిపై నిఘా పెట్టి చర్యలు తీసుకునే అధికారులు లేరు.

కలెక్టర్‌కు ఫిర్యాదు

భీమవరంలో కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ఉన్నా కూడా టిడ్కో వైపు కన్నెత్తి చూసే వారు లేరు. ఓట్లు కోసం వారి వద్దకు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు అక్కడ వారు సమస్యలతో సమతమతం అవుతున్న పట్టించుకోవడం లేదు. అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికి అటు ప్రజాప్రతినిధులు గాని ఇటు అధికారులు గాని పట్టించుకొవడం లేదు. అయితే సమస్యలు భరించలేక సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు పెద్ద సంఖ్యలో మహిళలు వెళ్లీ కలెక్టర్‌ నాగరాణికి మొరపెట్టకున్నారు. మంచినీళ్లు, టాయిలెట్స్‌ డ్రెయినేజి సమస్య, రోడ్డు, చెత్త, పారిశూద్ధ్యం సమస్యలతో తాము అక్కడ బతకలేకపోతున్నామని సమస్యలతో నిత్యం నరకం చూస్తుమని సమస్యల పరిష్కరించి రక్షించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

టిడ్కో ఇళ్ల సముదాయంలో గత 8 నెలలగా మంచినీటి సమస్యతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పైపులైన్‌, మంచినీటి ట్యాంకు ఉన్నా కూడా మాకు మంచినీళ్లు సరఫరా అనేది సక్రమంగా జరగడం లేదు. దాంతో దహం తీర్చుకోవడానికి బయట నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం.

– ఎస్‌. మురళీ, టిడ్కో నివాసి భీమవరం

సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక టిడ్కో ప్లాట్లు ఉండే టాయిలెట్స్‌ నిండిపోయి భరించలేకపోతున్నాం. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. బయట చూస్తే చెత్తచెదారం, అధ్వానంగా డ్రెయినేజీ నీళ్లు, దోమలతో సమతమతం అవుతున్నాం. మా సమస్యలను ఇప్పటికై నా పరిష్కరించాలి.

– కె.రామకుమారి, టిడ్కో నివాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement