మట్టి మాఫియా ఆగడాలు | - | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియా ఆగడాలు

Mar 17 2026 8:14 AM | Updated on Mar 17 2026 8:14 AM

పెనుగొండ: అధికార పార్టీ మద్దతు, అధికార యంత్రాంగం చేతులు తడిపేశాం మనల్ని ఎవడు ఆపేది అంటూ మట్టి మాఫియా రేచ్చిపోతోంది. ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్‌ లంక భూమి తవ్వకాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నా యథేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు. గత ఏడాది వేసవి కాలంలోనూ యలమంచిలి మండలంలో ఏటిగట్టు పనుల నెపంతో నక్కల డ్రెయిన్‌ గట్టును తవ్వేసారు. రైతులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తవ్వకాలు నిలిపివేశారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. గత తవ్వకాల వల్ల వర్షాకాలంలో నక్కల డ్రెయిన్‌లో వరద నీటితో ఆచంట వేమవరంలోని పలు వరిచేలు ముంపుకు గురయ్యాయి. దీంతో రైతులు రెండు మూడు సార్లు వరి నాట్లు వేసుకోవలసిన పరిస్థితి. సర్పంచ్‌ జక్కంశెట్టి చంటి, స్థానిక రైతులు తవ్వకాల వద్ద నిరసన చేపట్టారు. పలువురు రైతులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దృష్టికి సైతం తీసుకు వెళ్లడంతో, తవ్వకాల ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. తవ్వకాలు జరిపి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేశారు. రైతులు హెచ్చరికలు, నిరసనలు బేఖాతరు చేస్తూ మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. వందలాది వాహనాల్లో జేసీబీలతో యథేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తుండడంతో సోమవారం రైతులు మరోసారి నిరసన గళం విప్పారు. ఆచంట వేమవరం సర్పంచ్‌ జక్కంశెట్టి చంటి ఆధ్వర్యంలో పలువురు రైతులు అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి తవ్వకాలకు అనుమతులు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేవంటూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. నీటి పారుదల శాఖ, డ్రెయిన్స్‌ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తవ్వకాలు జరుగుతుండడంతో రెండు జేసీబీలను, ఆరు లారీలను అదుపులోకి తీసుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement