ఓపిక పట్టలేక.. వైద్యం అందక | - | Sakshi
Sakshi News home page

ఓపిక పట్టలేక.. వైద్యం అందక

Mar 14 2026 7:19 AM | Updated on Mar 14 2026 7:19 AM

సేవల్లో జాప్యం

సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్‌: తణుకులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి సమస్యల జబ్బు చేసింది. వైద్యులు, సిబ్బంది కొరత, మౌలికపరమైన అవసరాలతో అల్లాడుతోంది. పూర్తిస్థాయిలో రోగులకు సేవలు అందించలేక సతమతం చేస్తోంది. 200 పడకలతో చుట్టుపక్కల వంద గ్రామాల ప్రజలు పెద్దాసుపత్రిగా పిలుచుకుంటుంటారు. గతం నుంచి ప్రసవాలకు పేరొందడంతో జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి వైద్యసేవల కోసం గర్భిణులను ఇక్కడకు తీసుకువస్తుంటారు. సోమ, మంగళవారాల్లో 800 వరకు సాధారణ రోజుల్లో 500 పైగా రోజు వారి ఓపీ నమోదవుతుంటుంది. ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, కంటి విభాగాల్లో రోజుకు 15 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి.

పోస్టులు ఖాళీ : స్పెషలిస్ట్‌ వైద్యుల నుంచి ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది పోస్టులు 130 వరకు ఉండగా 116 మంది పనిచేస్తున్నారు. వీరిలో రెగ్యులర్‌ 55 మంది ఉండగా మిగిలిన వారు కాంట్రాక్టు, ఔ ట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌గా సేవలందిస్తున్నారు. 14 ఖాళీ పోస్టులో కీలమైన ఒక అనస్థీషియా వైద్యుడు, రేడియాలజిస్ట్‌, డెంటల్‌ సర్జన్‌ పోస్టులు, ఒక హెడ్‌ నర్స్‌, ఇద్ద రు డార్క్‌ రూం అసిస్టెంట్స్‌, బయో మెడికల్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులు ఖాలీ ఉన్నాయి.

రేడియోలజిస్ట్‌ లేరు

రెండు అనస్థీషియా పోస్టులకు గాను ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆయన అందుబాటులో ఉన్నంతసేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో అత్యవసరమైనప్పుడు, సెలవు రోజుల్లో అనస్థీషియా వైద్యుడు అందుబాటులో లేక బయటి నుంచి ప్రెవేట్‌ వైద్యున్ని పిలిపించాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ నిధుల నుంచి ప్రైవేట్‌ వైద్యులకు బిల్లులు చెల్లిస్తున్నారు. మరోపక్క జనరల్‌ సర్జరీ, ప్రసవాలకు సంబంధించిన కేసుల్లో కడుపులోపల పరిస్థితి తెలుసుకునేందుకు అత్యంత కీలకమైన స్కానింగ్‌ విభాగంలో రేడియాలజిస్ట్‌ అందుబాటులో లేరు. రేడియాలజిస్ట్‌ ఇచ్చే రిపోర్టుల బట్టి జనరల్‌ సర్జరీ వైద్యులు, గైనకాలజిస్ట్‌లు ప్రసవాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. అయితే రెండు స్కానింగ్‌ మెషీన్లు ఉన్నా రేడియాలజిస్ట్‌ అందుబాటులో లేకపోవడంతో డెలివరీ కేసుల్లో కొందరికి ప్రైవేటు ఆస్పత్రిలో స్కానింగ్‌ పరీక్షలు చేయిస్తుండగా, మిగిలిన కేసుల్లో రోగులు ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి దుస్థితి ఉంది.

వేధిస్తున్న సమస్యలు

సిబ్బంది ఆధార్‌ కార్డు ద్వారా ఆన్‌లైన్‌ చేసి ఓపీ చీటి ఇస్తుండటంతో రోగులు ఓపీ కోసం క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కోసారి సాంకేతికపరమైన ఇబ్బందితో చీటీ కోసం చాలాసేపు నిరీక్షించాల్సి వస్తుందని రోగులు అంటున్నారు. నెల రోజుల క్రితం ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించినా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

తిష్టవేసిన డ్రెయినేజీ సమస్య

ఆస్పత్రిలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో అవుట్‌లెట్‌ పైపులు లీకేజీలతో ఆస్పత్రి వెనుకభాగంలో పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉంది. పైపుల నుంచి వ్యర్థాలు బయటకు వచ్చి దుర్గంధభరితమైన వాతావరణం నెలకొంటుంది. పక్కనే డయాలసిస్‌ సెంటర్‌, సత్యసాయి అన్నదాన క్యాంటీన్‌లు ఉండడంతో ఆయా విభాగాలకు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న క్వార్టర్స్‌ భవనాలు శిధిలావస్థకు చేరా యని కొంతకాలం క్రితం పడగొట్టారు. అయితే నూతన భవన నిర్మాణాలు చేపట్టకపోగా తొలగించిన భవన శకలాలు మాత్రం ఆస్పత్రి ఆవరణలోనే మూలుగుతున్నాయి.

జనరల్‌ ఫిజీషియన్‌ ఆస్పత్రిలో ఒక్కరే ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరో పోస్టు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో ఎంబీబీఎస్‌ వైద్యులతో నడపాల్సి వస్తుంది. డెంటిస్ట్‌ సర్జన్‌ అందుబాటులో లేక పూర్తిస్థాయిలో డెంటల్‌ వైద్యం అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఎక్స్‌రే విభాగంలో రేడియోగ్రాఫర్‌, ఒక అసిస్టెంట్‌ మాత్రమే విధుల్లో ఉండటంతో రోగుల వైద్యసేవల్లో కొంతమేర జాప్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. వందల సంఖ్యలో వచ్చే రోగుల సంఖ్యకు తగ్గట్లుగా ముగ్గురు రేడియోగ్రాఫర్‌లు అందుబాటులో ఉండాల్సి ఉన్నా ఒక్కరితోనే నెట్టుకువస్తున్నారు. ఒక్క రేడియోగ్రాఫర్‌ ఒక అసిస్టెంట్‌తో రోజుకు 100 వరకు ఎక్స్‌రేలు తీయాల్సి వస్తుంది. రక్తపరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లో ఐదుగురు ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఇద్దరు అసిస్టెంట్‌లు ఉండాల్సి ఉండగా ఒక టె క్నీషియన్‌, ఒక అసిస్టెంట్‌ డిప్యూటేషన్‌పై వేరే విధుల్లో ఉన్నారు. ల్యాబ్‌లో మైక్రోబయాలజీ, థైరాయిడ్‌, హార్మోనన్‌ పరీక్షలు నిర్వహించడంలేదు. పూర్తిస్తాయిలో సిబ్బంది లేక నిత్యం 1,200 నుంచి 1,500 వరకు టెస్టులు నిర్వహించడంలో సిబ్బంది తలమునకలవుతున్నారు.

తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సిబ్బంది కొరత

స్పెషలిస్ట్‌ వైద్యుల నుంచి స్టాఫ్‌ వరకూ 14 పోస్టులు ఖాళీ

రోగుల అవస్థలు

రోజుకు 700 వరకు ఓపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement