భీమవరం: వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖతర్‌లో పార్టీ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. పార్టీ నాయకుడు మనీష్‌రెడ్డి మాట్లాడుతూ యుద్ధ వాతావరణంతో ఖతర్ ప్రజలు భయపడుతున్నా వైఎస్సార్‌సీపీపై అభిమానంతో వేడుకలు నిర్వహించామన్నారు. అలీమ్, వాసర్ల సురేష్, బాబు సీకోలు, జేమ్స్, షాన్ షేక్, సీకోలు ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకుడు సురేష్ ఫోన్‌లో తెలిపారు.
భీమవరం: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను తక్షణం ఉపసంహరించాలని, వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ సరఫరాను మరింత పెంచాలని, ఎస్మా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాశం చౌక్‌లో ధర్నా నిర్వహించారు. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమై భా రాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని అ న్నారు. ఇరాన్‌పై సామ్రాజ్యవాదులు చేపట్టిన యుద్ధ్దాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని, పశ్చిమాసియాలో శాంతి నెలకొనడానికి కేంద్ర ప్ర భుత్వం కృషి చేయాలని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, సికిలే పుష్పకుమారి, మల్లుల శ్రీనివాసరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): విలువలతో కూడిన కవిత్వాన్ని సమాజానికి అందించడంలో కవయిత్రి మొల్లకు ప్రత్యేక స్థానం ఉందని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి జేసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి రామాయణాన్ని మొల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగులో రచించడం గర్వించదగ్గ విషయమన్నారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్‌వీ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: రైతులు పంటల్లో ఖర్చును తగ్గించుకునేందుకు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. వెంకట్రామన్నగూడెం కేవీకేలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో 1,03,761 మంది రైతులకు సాయం అందించామన్నారు. సబ్సిడీపై 45 డ్రోన్లను జిల్లాలో అందజేశామన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఉద్యాన వర్సిటీ వీసీ కె.ధనుంజయరావు, ఏపీ భవన నిర్మాణ, ఇతర కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ, వర్సిటీ రిజిస్ట్రార్ కె.మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్–డి 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని, ఈ మేరకు అభ్యర్తుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఏలూరు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమధికారి ఆర్‌వీ నాగరాణి, శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 20లోపు దరఖాస్తులు సమర్పించాలని, 100 మంది అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు.


