పుష్కర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి
నరసాపురం: 2027 ఆగస్టులో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి నరసాపురంలో చేయాల్సిన ఏర్పాట్లు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. పుష్కర ఏర్పాట్లకు సంబందించి బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు, పట్టణంలోని వశిష్ట గోదావరి వలంధర్‌రేవు ఘాట్‌ను గురువారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్షించారు. గోదావరి పుష్కరాలకు రికార్డు స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం నరసాపురంలో ఏర్పాట్లు, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని చెప్పారు. పుష్కర ఘాట్‌లు ఎంతమేర అభివృద్ధి చేయాలి, కొత్తగా ఎన్నిచోట్ల రోడ్డు నిర్మాణాలు చేయాలన్న అంశాలపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట నరసాపురం ఆర్డీవో దాసి రాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి తదితరులు ఉన్నారు.
తణుకు అర్బన్: తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఇద్దరు ఏఎస్సైలను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై ఎం.రాజ్యలక్ష్మిని భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు, ఏఎస్సై పి.సత్యనారాయణను మొగల్తూరు పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఇటీవల తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన ఏసీబీ దాడుల అనంతరం దిద్దుబాటు చర్యల్లో భాగంగా చాలా కాలంగా ఒకే ప్రాంతంలో ఉంటున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి బదిలీ వేటు వేస్తున్నట్లుగా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.
తణుకు అర్బన్ : తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వల్లూరి పండుబాబు అలియాస్ పండు అనే రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తణుకు పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసు అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ పండు తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ పోలీసు ఆదేశాలను ధిక్కరిస్తూ గత కొంతకాలంగా హింసాత్మక దాడులు, బెదిరింపులు, దోపిడీలు, సెటిల్‌మెంట్లు, హత్యాయత్నాలు వటి పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. దీంతో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో ముందస్తు నేర నియంత్రణలో భాగంగా అతడిని నిర్భంధించి పీడీ యాక్ట్ పెట్టినట్లు వివరించారు.
పెంటసాడు: వివాహిత ఆత్మహత్య కేసులో భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని కొండేపాడుకు చెందిన బిట్రా పోశిరత్నం (21) ఇటీవల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి అత్తివారింటి సభ్యులే కారకులుగా పేర్కొంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం పోశిరత్నం భర్త బిట్రా వినేష్‌తో పాటు, మావ బిట్రా శ్రీను, అత్త లక్ష్మిలను డీఎస్పీ విశ్వనాథ్ సమక్షంలో అరెస్ట్ చేసి కోర్టుకు పంపగా కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై చినస్వామి తెలిపారు. నిందితులను తణుకు సబ్‌జైలుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు.
పెంటపాడు: ఓ వ్యక్తిని కులంపేరుతో దూషించారన్న ఫిర్యాదు మేరకు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి తెలిపారు. అలంపురం గ్రామంలోని ఎస్సీపేటలో గంజి అనిల్‌కుమార్ అనే వ్యక్తిని నూనె సుగుణ, గుణ్ణం సుందరి, పుట్టా వరలక్ష్మి, పుట్టా హరిశ్ఛంద్రరావు అనే వ్యక్తులు కులంపేరుతో దుర్భాషలాడి దూషించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


