చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

Feb 27 2026 4:05 AM | Updated on Feb 27 2026 4:05 AM

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

చోరీ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌

నిందితుల్లో ముగ్గురు మైనర్లు చోరీ సొత్తు స్వాధీనం

జంగారెడ్డిగూడెం : మూడు వేర్వేరు చోరీ కేసులకు సంబంధించి నిందితులు ఆరుగురుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్‌ కార్యాలయంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ వివరాలు వెల్లడించారు. ఈనెల 21న ముగ్గురు వ్యక్తులు ప్రైవేట్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నక్కల వెంకటేశ్వర్లును బుట్టాయగూడెం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి అతని వద్ద ఉన్న బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్‌లు లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులు ఉండి మండలం చెరుకువాడకు చెందిన ఈడ వెంకటపవన్‌సాయి, మరో ఇద్దరు మైనర్‌లను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తుతోపాటు నేరానికి వినియోగించిన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ. 3.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. నిందితుల్లో ఈడ వెంకట్‌పవన్‌సాయిని న్యాయస్థానంలో, ఇద్దరు మైనర్‌లను జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ముందు హాజరు పరచనున్నట్లు ఏఎస్పీ చెప్పారు.

మరో రెండు కేసుల్లో...

ఈనెల 23న అర్ధరాత్రి సీతానగరం ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగుగొట్టి అందులోని ఎల్‌ఈడీ టీవీ చోరీ చేశారు. అలాగే ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి పట్టణంలోని శాలిపేట సెంటర్‌లో ఒక దుకాణం షట్టర్‌ తాళాలు పగులగొట్టి, షాపులోని రూ.18వేలు నగదు చోరీ చేసి, దుకాణంలో ఉన్న సీసీ కెమేరాను ధ్వంసం చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులుగా జంగారెడ్డిగూడెం డాంగేనగర్‌కు చెందిన తాడేపల్లి చిట్టిబాబు, బుట్టాయగూడెం రోడ్‌ విరోధుల వారి వీధికి చెందిన షేక్‌ శంకర్‌, మైనర్‌ బాలుడిని గుర్తించి స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తు రూ. 16,500, ఎల్‌ఈడీ టీవీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా, మైనర్‌ను జువైనెల్‌ జస్టీస్‌ బోర్డు ముందు హాజరు పరుస్తామని ఏఎస్పీ తెలిపారు. కాగా, ఈ కేసును చేధించిన ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్‌, పీసీలు ఎన్‌.రమేస్‌, షేక్‌ షాన్‌బాబులను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఎంవీ సుభాష్‌, ఎస్సై ఎన్‌వీప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement