ఆగి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి
కై కలూరు, ఆకివీడు: రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొని పురోహితుడు మృతి చెందిన ఘటన ఆలపాడు కో–ఆపరేటీవ్ సమీపంలో గురువారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన గొర్తి శ్రీనివాసరావు(53) పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతనికి భార్య, ఇరువురు కుమార్తెలు సంతానం. కై కలూరు మండలం గోపవరంలో ఓ గృహప్రవేశ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి ఆకివీడు వెళుతుండగా ప్రమాదం జరిగింది. భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసరావు మరణించాడు. భార్య దుర్గా విజయలక్ష్మి ఫిర్యాదుపై రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేశారు. ఆయన మృతి పట్ల బ్రాహ్మణ సంఘం, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.
ఏలూరు టౌన్: నకిలీ వైర్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు నగరంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంపై దాడులు నిర్వహించి షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పవర్‌పేటలోని మహావీర్ ఎలక్ట్రికల్స్ పేరుతో విద్యుత్ సామగ్రి దుకాణాన్ని కుమార్‌జైన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ షాపులో హావెల్స్ కంపెనీకి చెందిన వైర్లు నకిలీవి విక్రయిస్తున్నాడనే సమాచారంతో గురువారం ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, సిబ్బందితో దుకాణంపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. భారీగా హావెల్స్ కంపెనీ నకిలీ వైర్ల కట్టలను గుర్తించి షాపు యజమాని కుమార్‌జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కామవరపుకోట : స్థానిక పోస్టాఫీస్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పోస్టాఫీస్ తాళాలు పగలగొట్టి కార్యాలయంలో ఉన్న రికార్డులను చిందర వందర చేశారు. అంతేగాకుండా బీరువాలో ఉన్న ఖాళీ పాస్‌పుస్తకాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై గురువారం ఉదయం పోస్ట్ మాస్టర్ ఎం.మనోజ్ తడికలపూడి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై చెన్నారావు ఘటనా స్థలాన్ని పరిశలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


