యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు

Feb 26 2026 9:28 AM | Updated on Feb 26 2026 9:28 AM

యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు

యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు

నూజివీడు: రైతులు యాజమాన్య పద్ధతులను అవలంభించడం ద్వారానే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించొచ్చని మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కే రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని సుంకొల్లు, సిద్ధార్ధనగర్‌లలోని మామిడి తోటలను ఉద్యాన అధికారి ఆర్‌ హేమతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాధారాణి మాట్లాడుతూ మామిడి పూత పిందె కట్టి నిలవడానికి, పిందెలు బఠానీ సైజు ఉన్నప్పుడు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలన్నారు. కాయ పెరిగే దశలో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పిందే రాలడాన్ని నివారించడానికి నాఫ్తలిన్‌ ఎసిటిక్‌ యాసిడ్‌ 20 పీపీఎం 20 మిల్లీ గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు.

తేనెమంచు పురుగు నివారణ ఇలా..

అజాడిరిక్టన్‌ 3000 పీపీఎం రెండు మిల్లీలీటర్‌ నీటికి, బుప్రోపెజన్‌ 25ఎస్‌సీ ఒక ఎంఎల్‌ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 17.8 ఎస్‌ఎల్‌ 0.3 మిలీ లేదా థయామిథాగ్జామ్‌ 25 శాతం డబ్ల్యూజీ 0.3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.

తామర పురుగుల నివారణకు..

నీలిరంగు జిగురు అట్టలు 40 నుంచి 50 చొప్పున తోటల్లో ఏర్పాటు చేసుకోవాలి. వేప నూనె మూడు వేల పీపీఎం 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొంగామియ సోప్‌ 7.5 గ్రా, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎసిఫేట్‌ 75 ఎస్‌పీ 1.5 గ్రా లేదా పిప్రోనిల్‌ 5ఎస్‌సీ 2 మి లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు నివారణకు..

నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా హెక్సాకోనజోల్‌ 2 మి లీ లేదా అజాక్సిస్ట్రోబిన్‌ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి

పక్షి కన్ను తెగులు నివారణకు..

3 గ్రా కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ లేదా కార్బన్డిజం 1 గ్రా+ మాంకోజెబ్‌ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మసి మంగు నివారణకు ఎమామెట్టిన్‌ బెంజయెట్‌ 0.4 గ్రా లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకులపై మసిని తొలగించుటకు రెండు కిలోల గంజిపొడిని గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు లీటర్లు కలిపి ఉడికించి తరువాత మిగతా నీరు పోసి వంద లీటర్ల గంజి ద్రావణం తయారుచేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజుల్లో పిచికారీ చేయాలి. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్‌ హేమ, రైతులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement