కౌలుకోలేని దెబ్బతీశారు
నాడు లక్ష్యానికి మించి..
అసలు రైతుల మాదిరి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు పెట్టుబడి సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తాం, పంట రుణాలు, ఇతర సదుపాయాలు వర్తింపచేస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి ఊసే మరిచింది. హామీలకు ఎగనామం పెట్టి వారి నడ్డి విరిచింది. దగాపడ్డ కౌలు రైతులు ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. జిల్లా కేంద్రం భీమవరంలో రెండు రోజుల పాటు నిరసన దీక్షలు నిర్వహించారు.
కౌలు రైతు పోరుబాట
అధికారంలోకి వస్తే కౌలు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కౌలు రైతులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ సాయం అందక కౌలు రైతులు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి కౌలు రైతులను వంచించారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు తక్షణం ఆర్ధికసాయం అందించి ఆదుకోవాలి.
– ఉందుర్తి శ్రీనివాసరావు,
కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఏవిధంగానూ ఆదుకోవడం లేదు. తక్షణం పెట్టుబడి సాయం కింద కౌలు రైతులకు రూ.20 వేలు అందజేయాలి. ఈ సీజన్‌కు సంబంధించి రెండు విడతల సొమ్ము జమచేయాలి. పంట నష్టపరిహారంతో పాటు, యజమానులకు సంబంధం లేకుండా ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలి.
– రామాంజనేయులు,
కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
సాక్షి, భీమవరం: జిల్లాలో వరి పండించే రైతులు 3.5 లక్షల వరకు ఉండగా 1.5 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారని అంచనా. సాగులో కష్టం వస్తే మొదటిగా కుదేలయ్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం, వచ్చిన దానిలో పొలం యజమానికి మిగతా చెల్లించగా వారికి మిగిలేది అంతంతమాత్రమే. పంట తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు పంటకు నష్టం కలిగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయేది కౌలు రైతులే. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీని తగ్గించేశారు. జిల్లాలో 1.05 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా కేవలం 72,259 మందికి మాత్రమే జారీచేశారు.
కూటమి దగా
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తామంటూ ఎన్నికల్లో పదేపదే చెప్పిన కూటమి అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్‌లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకుండా చేసింది. గుర్తింపు కార్డులు పొందిన వారికి రెండో దఫాలో సాయం అందిస్తారని కూటమి నేతలు చెప్పుకొచ్చారు. మొదటి దఫాతో కలిపి ఒక్కో కౌలు రైతుకు రూ.10 వేల చొప్పున సాయం అందాల్సి ఉంది. రెండో విడతలోనూ చంద్రబాబు సర్కారు కౌలురైతులకు ఎగనామం పెట్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరోపక్క తొలకరిలో వచ్చిన మోంథా తుఫానుతో జిల్లాలోని 9201 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉంటారని అంచనా.
కౌలు రైతులకు జగన్ సర్కారు కొండంత అండగా నిలిచింది. అసలు రైతుల మాదిరి రైతు భరోసా, పంటల బీమా పరిహారం, తదితర అన్ని ప్రయోజనాలను అందించింది. భూ యజమానుల్లో అపోహలు తొలగించి కౌలు రైతు గుర్తింపు కార్డులను గణనీయంగా పెంచింది. 2023–24 సీజన్‌లో జిల్లాలో 84,185 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ లక్ష్యానికి గాను 89,589 కార్డులు జారీచేశారు. జగన్ పాలనలో లక్ష్యానికి మించి కార్డులు జారీ చేస్తే కూటమి పాలనలో కార్డుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం.
పెట్టుబడి సాయానికి ఎగనామం
కూటమి మోసంపై కౌలు రైతుల మండిపాటు
పెట్టుబడి సాయం, పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్
జిల్లా కేంద్రంలో రెండు రోజులు నిరసన దీక్ష
జిల్లాలో 72,259 మంది కౌలురైతులు
చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ కౌలు రైతులు పోరుబాట పట్టారు. పెట్టుబడి సాయం విడుదల చేయాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని, భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటి సాధన కోసం ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు భీమవరంలోని ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద సోమ, మంగళవారాల్లో రెండు రోజులు పాటు రిలే దీక్షలు నిర్వహించారు. వీరి దీక్షలకు ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ, తదితర సంఘాల నేతలు కౌలు రైతులకు మద్దతు తెలిపారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేయాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం రిలే దీక్షల ముగింపు అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు.


