జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు

Feb 25 2026 10:41 AM | Updated on Feb 25 2026 10:41 AM

జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు

జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు

చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు

లాడ్జిలు, ప్రత్యేక భవనాల్లో గుట్టుగా నిర్వహిస్తున్న వైనం

తణుకు అర్బన్‌: టీ 20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫీవర్‌ క్రీడాభిమానులను ఉత్సాహపరుస్తుంటే.. క్రికెట్‌ బెట్టింగ్‌ బుకీలకు మాత్రం రూ.కోట్లు తెచ్చిపెడుతోంది. తణుకుకు పట్టణానికి చెందిన ఒక రాజకీయ నేత కుమారుడు క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తణుకులో అప్పటిటలో సంచలనం రేకెత్తించింది. పైడిపర్రు గ్రామానికి చెందిన ఒక ఏసీ మెకానిక్‌ సైతం బెట్టింగ్‌ల మత్తులో అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రకమైన బెట్టింగ్‌ ఇబ్బందులు కొన్ని మాత్రమే వెలుగులోకి రాగా మరెన్నో వ్యవహారాలు బయటకు రావడం లేదు.

పందెంరాయుళ్లు అమాయకులను బెట్టింగ్‌ రొంపిలోకి దింపి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. బంతి బంతికి బెట్టింగ్‌ చేస్తూ యువతను బెట్టింగ్‌లోకి దింపి వారి జీవితాలను నాశనం చేసేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తూ బుకీలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. సిక్స్‌ కొడితే ఇంత, ఫోర్‌ కొడితే ఇంత, వికెట్‌ పడితే ఇంత అంటూ ఫిక్స్‌ చేసి నిర్వహిస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం టీ 20 వరల్డ్‌కప్‌ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం జోరుగా నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో లాడ్జిలు, ప్రత్యేక భవనాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీల దందాలో అగ్రశ్రేణి జట్లు ఆడుతున్న రోజుల్లో సుమారుగా రూ.6 కోట్లకుపైగా చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. బుకీలు యువతను రెచ్చగొడుతూ వారి మానసిక గమనాన్ని సైతం పక్కదారి పట్టిస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో ప్రస్తుతం క్రికెట్‌ ఫీవర్‌తో బెట్టింగ్‌లు నడుస్తుండగా తణుకు పట్టణంతోపాటు పైడిపర్రు కేంద్రంగా ఈ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయని గ్రామస్తులే చెబుతున్నారు.

ఇళ్లు గుల్ల : బెట్టింగ్‌ వ్యవహారంలో కొడుకు చదువులు, కుమార్తెల వివాహాల కోసం కూడబెట్టిన సొమ్మును సైతం క్రికెట్‌ బెట్టింగ్‌లోకి తరలించే పరిస్థితులు నెలకొన్నాయి. యువత చెడు మార్గంలోకి వెళ్లి తమ ఇళ్లు గుల్ల చేసుకోవడంతో మహిళల పుస్తెలు కూడా పందేల్లో ఫణంగా పెడుతున్న తీరు కలచివేస్తోంది. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటుపడిన యువత క్రికెట్‌ బుకీల వలలో పడి తమ ఇళ్లు, వాకిలి అమ్మినా తీరని అప్పుల్లో కుటుంబాన్ని ముంచేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరకు ఆత్మహత్యల బారిన పడుతున్నారు. క్రికెట్‌ బుకీల వ్యవహారంపై పోలీసు అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement