నేర నియంత్రణే లక్ష్యం
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయంగా పనిచేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలని, సిబ్బంది కేటాయింపులు కార్యాలయ నిర్వహణలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవా స్పందన సమయాన్ని మరింత తగ్గించాలని, కేసుల దర్యాప్తులో సాక్ష్యాధారాల సేకరణ, సమన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో గోప్యతను కాపాడటంతో పాటు, మార్చి 14న జరగనున్న లోక్ అదాలత్ ద్వారా గరిష్ట స్థాయిలో కేసులను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు రఘువీర్ విష్ణు, డి.విశ్వనాథ్, జి.శ్రీ వేద పాల్గొన్నారు.


