30 దాటినా .. ఒంటరే! | - | Sakshi
Sakshi News home page

30 దాటినా .. ఒంటరే!

Feb 22 2026 8:42 AM | Updated on Feb 22 2026 8:42 AM

30 దాటినా .. ఒంటరే!

30 దాటినా .. ఒంటరే!

అమ్మాయిలు కరువు

పెళ్లికాని ప్రసాద్‌లకు కొత్త తంటా

మ్యారేజ్‌ బ్యూరోల్లో పేరుకుపోతున్న బయోడేటాలు

తాడేపల్లిగూడెం: ఆరంకెల జీతం, ఆస్తిపాస్తులు ఉన్నా.. పెళ్లి మాత్రం కావడం లేదు. సమాజంలో పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లి పీటలు ఎక్కే భాగ్యం దక్కడం లేదు. ఒకప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లికొడుక్కి కట్నకానుకల కోసం ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పిల్ల దొరికితే చాలు.. కట్నం అక్కర్లేదు, అని అబ్బాయిల తల్లిదండ్రులు అనే పరిస్థితి ఏర్పడింది.

చాంతాడులా వధువుల డిమాండ్లు

మారుతున్న కాలంతో పాటు అమ్మాయిల ఆలోచనా తీరు మారింది. ఒకప్పుడు పెళ్లిచూపుల్లో అబ్బాయిలు ప్రశ్నలు వేసేవారు, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిల అర్హతలను పరీక్షిస్తున్నారు. వాళ్ల లిస్టు వింటుంటే అబ్బాయిలు పెళ్లిళ్లపై ఆశలు వదులేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌, చిన్న కుటుంబం, ఆస్తిపాస్తులు ఇవన్నీ చూస్తుండడంతో పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. గత పదేళ్లలో అమ్మాయిలు ఉన్నత విద్య అభ్యసించడం సర్వసాధారణంగా మారింది. దీంతో తమకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయి, ఎక్కవ జీతం వచ్చే అబ్బాయి కావాలంటున్నారు. ఇంజినీరింగ్‌ కోర్సులు చేసిన అమ్మాయిలు.. డిగ్రీ చదివిన అబ్బాయిలను వద్దంటున్నారు.

మ్యారేజ్‌ బ్యూరోల్లో వెయిటింగ్‌

మ్యారేజ్‌ బ్యూరోలకు వస్తున్న వారిలో 30 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అమ్మాయికి తగ్గ అబ్బాయి దొరకడం లేదని కొందరు అంటుంటే, అసలు అమ్మాయిలే దొరకడం లేదని అబ్బాయిల తరపు వారు బాధపడుతున్నారు అని పురోహితులు, మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు.

లెక్కల్లో తేడా

ఉమ్మడి పశ్చిమలో 2011 జనాభా లెక్కల ప్రకారం 39,36,966 జనాభా ఉండగా.. 19,72,048 మంది పురుషులు, 19,64,918 మంది మహిళలు ఉన్నారు. కొత్త పశ్చిమ జనాభా లెక్కల ప్రకారం 18 లక్షల మంది జనాభాలో పురుషులు 8,89,252 మంది, మహిళలు 8,90,683 మంది ఉన్నారు. ప్రతి 1004 మంది మహిళలకు, 1000 మంది పురుషులు ఉన్నారు. వెయ్యి మంది బాలురకు, 964 మంది బాలికలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2011 లెక్కల ప్రకారం బాలికల నిష్పత్తి తక్కువగా ఉండడం పెళ్లిళ్లపై ప్రభావం చూపిందంటున్నారు.

మా అమ్మాయిలకు సంబంధాలు చూడమని గతంలో మ్యారేజ్‌ బ్యూరోలకు బయోడేటాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వయసు ముదిరిన యువకులకు సంబంధాలు చూడమనే వారు అధికం అయ్యారు. అయినా వివాహాలు కుదరడం లేదు.

– నాయుడు, మ్యారేజ్‌ బ్యూరో అసోసియేషన్‌ నాయకుడు

Advertisement
 
Advertisement
Advertisement